అకాల మరణాన్ని దూరం చేసే ఇంటిపని

కనీసం 24 నిమిషాటు శారీరక శ్రమ అవసరం
వంట చేయడం, అంట్లు తోమడం వంటివి మేలు

న్యూఢిల్లీ, ఆగస్టు 24: చాలామందికి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అంటే మహా చిరాకు. అంతదాకా ఎందుకు? తమ పనులు తాము చేసుకోవాలన్నా బద్దకమే. దాహం వేసినప్పుడు ఫ్రిజ్‌ పక్కనే ఉన్నా మంచినీళ్ల కోసం భార్యామణికి ఆర్డర్‌ వేస్తారు. కనీసం తాగిన కాఫీ కప్పును సింక్‌లో వేసేందుక్కూడా సోఫాలోంచి లేవరు. టీవీ చానల్‌ మార్చేందుకు టీవీ రిమోట్‌ ఎక్కడ? అని అసహనం వ్యక్తం చేస్తారు. మీకు గనక ఈ అలవాటే ఉంటే తక్షణం మార్చుకోవాల్సిందే! ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం ఆరోగ్యానికి మంచిదే కాదు.. అకాల మరణం ముప్పును కూడా గణనీయంగా తగ్గిస్తుందట! ఈ విషయాన్ని లీసిస్టర్‌ యూనివర్సిటీ తమ అధ్యయనంలో తేల్చింది. ఇంట్లో రోజూకు కనీసం 24 నిమిషాలను శారీరక శ్రమకు కేటాయిస్తే మీ ఆయష్షును పెంచుకోవచ్చునని వారు చెబుతున్నారు. అంటే.. వంటపని చేయడమో, అంట్లు తోమడమో, మొక్కలకు నీళ్లు పోయడమో వంటివి చేయాలంటున్నారు. అదేపనిగా టీవీ చూసే అలవాటును మానుకొని.. ఇంట్లో అటూ ఇటూ పచార్లు చేయడం కూడా మంచిదేనంటున్నారు.