గ్రీన్‌ టీతో ఆయుష్షు.. ఆరోగ్యం..

బీజింగ్‌, జనవరి 9: వారానికి కనీసం మూడుసార్లు గ్రీన్‌ టీ తాగితే ఆరోగ్యానికి మేలని చైనాలో చేపట్టిన ఓ సర్వేలో తేలింది. గుండె నొప్పి, గుండెపోటు, కేన్సర్‌ వంటి జబ్బులు లేని లక్షమందికిపైగా వ్యక్తులను ఎంచుకుని వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు గ్రీన్‌ టీ తాగే వారు, మూడు కంటే తక్కువసార్లు గ్రీన్‌ టీ తాగేవారిగా విభజించి సర్వే నిర్వహించారు. వీరిని ఏడేళ్లకు పైగా పరిశీలించారు. దీనిప్రకారం క్రమం తప్పక గ్రీన్‌ టీ తాగే అలవాటున్నవారి కంటే.. అలవాటు లేని వారు 1.41 ఏళ్ల ముందుగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 1.26 ఏళ్ల జీవితకాలం కూడా తగ్గుతోందని స్పష్టమైంది. అంతేకాక వారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు 20 శాతం ఎక్కువని సర్వేలో తేలింది.