జ్వరాల దృష్ట్యా సర్కారు కీలక నిర్ణయం

సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు

బోధన ఆస్పత్రులకు సర్కారు ఆదేశం
వైరల్‌ సీజన్‌ ముగిసే దాకా కొనసాగింపు

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లోనూ బోధన ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు సమాచారం అందించినట్లు వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం తెలిపారు. సెలవు రోజులు, ఆదివారాల్లో కూడా వైద్య విద్య సంచాలకుడి పరిధిలో ఉన్న అన్ని మెడికల్‌ కాలేజీల్లో ఈ సేవలు కొనసాగుతాయి. ప్రధానంగా హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రి, ఈఎన్‌టీ, నీలోఫర్‌ ఆస్పత్రుల్లో ఇక సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రులు పనిచేసే రోజుల్లోనే వైద్య సేవలందిస్తుండడంతో సెలవు రోజు తర్వాత రోగుల సంఖ్య ఒక్క సారిగా పెరుగుతోంది. దీనికి పరిష్కారంగా సెలవు రోజుల్లోనూ వైద్య సేవలు అందిస్తే ఒత్తిడి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఆయా రోజుల్లో వచ్చే రోగులకు వైద్య సేవలతో పాటు అవసరమైన పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందించనున్నారు. ఇందుకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని డీఎంఈ తెలిపారు.