డెంగీతో ఐదుగురు మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): డెంగీతో సోమవారం ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడుకు చెందిన కొరకొప్పు సుష్మ(21)కు ఆదివారం డెంగీ నిర్ధారణ కాగా.. సోమవారం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోకులగూడెం బాల్యాతండాకు చెందిన భూక్యా పార్వతి(32), భూక్యా చిన్నేశ్‌ దంపతులు రెండు రోజులుగా డెంగీతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతి పరిస్థితి విషమించి మృతి చెందింది. కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన కూలీ భూక్యా భాస్కర్‌(25) డెంగీతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ములుగు జిల్లా నరసింహసాగర్‌ మాజీ సర్పంచ్‌ వెంకటరామారావు (70), మిర్యాలగూడకు చెందిన గడ్డం రాంరెడ్డి(59) డెంగీతో చనిపోయారు.