టైప్‌ 2 డయాబెటిస్‌ను చిన్నప్పుడే గుర్తించవచ్చు!

19-09-2019: టైప్‌-2 డయాబెటిస్‌... ఇది సాధారణంగా మధ్య వయస్కుల్లో, వృద్ధుల్లో కనిపిస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ దాదాపు 50 ఏళ్ల వయసులో ఇది బయటపడుతుంది. ముందే ఈ వ్యాధి లక్షణాలను కనిపెడితే దాన్ని నిర్మూలించే అవకాశం ఉంటుంది. బ్రిటన్‌ శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా చేసిన పరిశోధన ఈ దిశగా సత్ఫలితాన్ని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ శాస్త్రవేత్తలు రక్త నమూనాలు, జన్యుక్రమం విశ్లేషణ ఆధారంగా టైప్‌-2 డయాబెటిస్‌ లక్షణాలను 8 ఏళ్ల వయస్సులోనే గుర్తించారు.
 
1990ల్లో 4,000 మంది పిల్లల రక్త నమూనాలు సేకరించారు. వారి కణజాలాలు, జన్యుక్రమాల ఆధారంగా పరిశోధనలు జరిపారు. వీటిలో 162 మందిలో టైప్‌ 2 డయాబెటిస్‌ లక్షణాలను గుర్తించారు. వీరి నుంచి 16, 18, 25 ఏళ్ల వయస్సులో రక్త నమూనాలు సేకరించి పరిశోధనలు జరపగా ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. టైప్‌ 2 డయాబెటిస్‌ లక్షణాలు ఉన్నవారిలో 8 ఏళ్ల వయస్సులో శరీరంలో హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండటం, 18 ఏళ్ల వయస్సులో శరీరంలో గ్లైకోప్రోటీన్‌ ఎసిటైల్‌, ఎమైనో ఆమ్లాల పెరుగుదలను గమనించారు. చిన్నతనంలోనే ఇలాంటి లక్షణాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకొంటే టైప్‌ 2 డయాబెటిస్‌ రాకుండా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.