తెలంగాణకు జ్వరం

వాతావరణంలో మార్పులతో రాష్ట్రవ్యాప్తంగా జ్వరాల పంజా
ఇంటికి ఒకరిద్దరు బాధితులు!
రోగులతో ఆస్పత్రులు కిటకిట
రాజధానిలో ప్రధాన ఆస్పత్రుల్లో
ఒక్కరోజే 6 వేల ఓపీ కేసులు
వాటిలో సగం వైరల్‌ జ్వరాలే
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3 నెలల్లో
43.67 లక్షల మంది బాధితులు
హైదరాబాద్‌లో 6.15 లక్షలు

రాష్ట్రానికి జ్వరమొచ్చింది! ఏ ఇంట్లో చూసినా ఒకరో ఇద్దరో జ్వరం బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు! 102, 103కు తగ్గని జ్వరం.. చలికి విపరీతమైన వణుకు.. తీవ్రంగా ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి.. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా!! అన్ని ఆస్పత్రుల్లో రోగుల కిటకిట! ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ విబాగాల వద్ద చాంతాడంత క్యూలు.. నిలబడలేక, కూర్చోలేక నిస్త్రాణగా వాలిపోయే జ్వరపీడితుల దృశ్యాలే!! 

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాకాలంలో ఏటా జ్వరాలు సాధారణమే అయినా ఈసారి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మే నెల నుంచి ఆగస్టు 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 43.67 లక్షల కేసులు నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన గణాంకాలు మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రులను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య కోటిన్నర వరకూ ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం రోగుల్లో దాదాపు సగం మంది చిన్నారులే ఉన్నారని సమాచారం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మూడు ప్రధాన ఆస్పత్రుల్లో (గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రి) సోమవారం ఒక్కరోజే దాదాపు 6 వేల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
 
సూక్ష్మజీవుల విజృంభణ..
సహజంగానే వర్షాకాలం జ్వరాల సీజన్‌. చల్లటి వాతావరణం.. కలుషిత నీటికారణంగా సూక్ష్మజీవుల విజృంభిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారు.. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు వాటి బారిన పడి విషజ్వరాల పాలవుతారు. వైరల్‌ ఫీవర్లతోపాటు.. డెంగీ, మలేరియా, చికున్‌గన్యా, టైఫాయిడ్‌ కేసులు కూడా ఈసారి పెరిగాయి. వైరల్‌ ఫీవర్‌తో వచ్చే ప్రతి పది కేసుల్లో ఒక డెంగీ కేసు ఉంటోందని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా డెంగీ కేసులు అసలు రిపోర్ట్‌ కాకుండానే ఉంటున్నాయి. జిల్లాల్లోని పలు ఆస్పత్రుల్లో పడకలు తక్కువగా ఉండడం వల్ల.. ఇన్‌పేషెంట్లుగా వచ్చేవారిని కింద పడుకోబెట్టి సెలైన్లు పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
 
కలుషిత నీటితో ముప్పు..
వర్షాల కారణంగా చాలాచోట్ల డ్రైనేజీలు పొంగిపోయి మంచినీటిలో కలిసిపోవడంతో నీరు కలుషితమైపోతోంది. ఆ నీటిని తాగినవారు జ్వరాలతో బాధపడుతున్నారు. డ్రైనేజీ నీళ్లు దోమలకు అవాసంగా మారుతుండడంతో రోగాలు జడలు విప్పుతున్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. వైరల్‌ ఫీవర్లు, డయేరియా మలేరియా, డెంగీ, న్యుమోనియా బారిన పడుతున్నవారిలో చిన్నారులే ఎక్కువగా ఉండడం ఇందుకు నిదర్శనం. ఈ వాతావరణంలో డ్రైనేజీ, వర్షపు నీళ్లు కలిసిన నీళ్లను తాగడం వల్ల కడుపునొప్పి, కడుపు మంట, విరోచనాలు, వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హోటళ్లు, ఇతర చోట్ల కలుషితనీటిని తాగితే జబ్బులు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు..
రాష్ట్రవ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్నందున సర్కారు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవలే ప్రకటించారు. 10 ఏజెన్సీ జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమై చర్చించారు. సీజనల్‌ వ్యాధులకు సంబంధించి.. ఆదిలాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌ రూరల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, రంగారెడ్డి, మహబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌లను డెంగి హైరిస్క్‌ జిల్లాలుగా, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌లను మలేరియా హైరి్‌స్కగా జిల్లాలుగా ప్రకటించారు. హైరిస్క్‌ అని ముందే తెలిసినా కనీసం ఈ జిల్లాల్లో వ్యాధి నివారణకు ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. హైరి్‌స్కలో లిస్ట్‌లో ఉన్న హైదరాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో 70 శాతం మలేరియా, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో మలేరియా కంట్రోల్‌ యూనిట్‌ ఉన్నప్పటికీ, నిరుపయోగంగానే మారింది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీ పర్వం కొనసాగుతోంది.
 
ఆరోగ్యశ్రీ లేకపోవడంతో..
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో మారుమూల గ్రామాల నుంచి జ్వరాలతో వస్తున్న రోగులకు సేవలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు ఉన్న ఆస్పత్రులకు బకాయిలు చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎంతో మంది నిరుపేదలు ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. అలాంటపుడు ప్రభుత్వం బిల్లులు చెల్లిండంలో జాప్యం చెయ్యకూడదు కదా!
- బానోత్‌ ప్రసాద్‌, బూడిదిగడ్డతండా, మహబూబాబాద్‌ జిల్లా
 
 
దోమలతో జర భద్రం..
వర్షాకాలంలో జ్వరాలు, ఇతర అనారోగ్యాలు సహజమే. మరో రెండు నెలలపాటు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పగటివేళల్లో దోమకాటుకు గురి కాకుండా చూసుకోవాలి. చెట్లు, చెరువులు, కుంటలు, మురికి కాలువలు, నీరు నిలిచిఉన్న ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. 
- డాక్టర్‌ నవేల్‌ చంద్ర, జనరల్‌ ఫిజీషియన్‌, నిమ్స్‌