కత్తెరను కడుపులోనే మరిచిన డాక్టర్లు

హైదరాబాద్‌లోని ఓ ‘ఆస్పత్రి’ నిర్వాకం

నల్లగొండ అర్బన్‌, అక్టోబరు 3: అదేదో సినిమాలో డాక్టరమ్మ తన చేతి గడియారాన్ని రోగి కడుపులో మర్చిపోతుంది. అచ్చం అలాగే హైదరాబాద్‌ కొత్తపేటకు చెందిన ఓ ఆస్పత్రి వైద్యులు 2 నెలల క్రితం మహిళ కడుపులో కత్తెర మర్చిపోయారు. గురువారం ఆ మహిళకు కడుపు నొప్పి తీవ్రం కావడంతో స్కానింగ్‌ చేశారు. దీంతో విషయం బయటపడింది. నల్లగొండ జిల్లా బచ్చన్నగూడెం గ్రామానికి చెందిన దోటి జ్యోతి (28)కి రెండు నెలల కిందట హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో గర్భస్థ శిశువును తొలగించారు. వైద్యులు కత్తెరను ఆమె కడుపులోనే మర్చిపోయారు. అప్పటి నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతోంది. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయడంతో, దాదాపు 10 అంగుళాల కత్తెర కడుపులోనే ఉన్నట్లు తెలిసింది.