ఖమ్మం జిల్లాలో డెంగీ మృదంగం

 

బోనకల్లు మండలాన్ని కబళిస్తున్న డెంగీ.. రెండు నెలల్లో 21 మంది మృతి 

ఒకే గ్రామంలో ఏడుగురి మృత్యువాత 
హడలెత్తి పోతున్న పల్లెజనం 
సగానికి సగం ఖాళీ అవుతున్న ఊళ్లు 
అతీత శక్తుల పనేనని కొందరి ప్రచారం 
అప్పులు చేసి సర్పంచుల పారిశుద్ధ్యం 
ముష్టెత్తి మందులు కొంటున్న ఆప్తులు 
హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి: భట్టి 

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా బోనకల్లు మండలాన్ని డెంగీ జ్వరం కబళిస్తోంది. మండలంలో నిజానికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది. మండలంలో ఇప్పటివరకు 21 మంది మరణించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 321 మందికి రక్త పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌ అని బయటపడింది. నిజానికి వేలమంది అలాంటి లక్షణాలతో కూడిన జ్వరాలతో అల్లాడుతున్నారు. రావినూతల అనే గ్రామంలో ఏకంగా ఏడుగురు మరణించారు. డెంగీ భయం ప్రజల్లో ఎంతగా ఆవరించిందంటే బంధువుల్లో ఎవరికైనా డెంగీ వచ్చిందంటే చూడటానికి కూడా రావడానికి భయపడుతున్నారు. ప్రజలు పిట్టల్లా కళ్లముందే టపా టపా రాలిపోతుంటే ఇదేదో ప్లేగు, కలరాల్లాగా అంటువ్యాధేమోననుకొని భయపడి ఇరుగు పొరుగు ఇళ్లకు తాళాలేసుకొని వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారు. కొందరు ఏకంగా తమ ఊరిని అతీత శక్తి పీడిస్తోందని భయపడి ఇళ్లను ఖాళీచేసి వెళ్లిపోతున్నారు. కృష్ణా జిల్లా సరిహద్దులోని బోనకల్లు మండలంలో నెలకొన్న పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం మండలంలో ‘విలేజ్‌ విజిట్‌’ నిర్వహించింది. మృతుల కుటుంబాలను పరామర్శించింది. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి పలు గ్రామాల్లో పర్యటించినపుడు నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

చేతులకు క్యాతలతో జనాలు 

రావినూతల... ఖమ్మం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదు వేల జనాభా. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సగం ఇళ్లకు తాళాలేశారు. మిగిలిన ఇళ్లలో జ్వరంతో నీరసించిన జనం. రోడ్లపై కనిపించిన ఒకరిద్దరూ చేతిలో మెడికల్‌ రిపోర్టుతో, మరో చేతికి క్యాత వేసుకొని కదులుతున్నారు. అక్కడక్కడా పిల్లాజెల్లా, లగేజీతో ఊరొదిలి వెళుతున్న వాహనాలు. వైద్యులు అతి సాధారణ జ్వరంగా భావించే డెంగీ జ్వరం రావినూతలను రెండు నెలల్లో ఈ పరిస్థితికి తెచ్చింది. శుక్రవారం రావినూతల గ్రామంలో విలేకరులు అడుగుపెట్టడానికి 15 నిముషాల ముందే లక్ష్మి(35) అనే మహిళ చనిపోయింది. అప్పటికే డెంగీ జర్వంతో ఊరంతా పడకవేయగా, వరుసగా సంభవిస్తున్న మరణాలతో బెంబేలెత్తిపోయి భార్యను పుట్టింటికి పంపించేందుకు మూడేళ్ల కూతురుతో బైక్‌పై హడావిడిగా వెళ్తూ లక్ష్మీనారాయణ అనే యువకుడు కనిపించారు. ఆయన్ను ఆపి మాట్లాడగా, తనకు వారం క్రితం డెంగీ సోకిందనీ, ఇపుడిపుడే నయమవుతుండగా తన భార్య రమాదేవి భయంతో ఏడుస్తోందనీ, అందుకే ఆమెను చిన బీరవల్లిలోని పుట్టింటికి పంపిస్తున్నానని చెప్పాడు. తన పిన్ని లక్ష్మి ఈ మఽధ్యే డెంగ్యూతో చనిపోయిందనీ, తన తల్లిదండ్రులకు కూడా డెంగీ సోకిందనీ, భార్య బిడ్డల్నైనా రక్షించుకునేందుకు పక్క ఊరు తరలిపోతున్నానని చెప్పారు. చేతికి క్యాతతో కనిపించిన వి.జ్యోతి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇద్దరు కుమారులకు, మామకు, భర్తకు డెంగ్యూ సోకి అందరూ క్యాతలతో కనిపించారు. పది రోజుల క్రితం తనకు సపర్యలు చేసేందుకు వచ్చిన తన తల్లికి కూడా డెంగ్యూ సోకిందనీ, దాంతో ఆమెను ఊరికి పంపి తోడి కోడలును సేవల కోసం తీసుకొస్తే ఆమె కూడా భయపడిపోయి ఊరెళ్లిపోతానంటోందని దీనగాఽథను చెప్పుకొచ్చారు. చుట్టాలు పలకరింపునకు కూడా రావడం లేదనీ, చివరకు పక్కింటి వాళ్లు కూడా మంచి నీళ్లు ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఊరినేదో శక్తి పీడిస్తోందని అంతా అంటున్నారన్నారు. అజ్మీరా రఘుపతి (65) అనే వ్యక్తి డెంగీతో చనిపోతే ఖర్మను ఘనంగా జరిపేందుకు ప్రయత్నం చేయగా ఊళ్లోవారు కూడా వచ్చేందుకు జంకారని కుటుంబ సభ్యుడొకరు ఆవేదనతో చెప్పారు. బోనకల్‌ మండలంలో 22 గ్రామాలున్నాయి. ప్రధానంగా బోనకల్‌ పట్టణంతోపాటు రావినూతల, గోవిందాపురం, దార్లపాడు, ముష్టికుంట్ల, ఆళ్లపాడు తదితర గ్రామాల్లో వేలాదిగా డెంగీ కేసులు కనిపిస్తున్నాయి. జ్వరాల నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి పారిశుద్ధ్యం పనులు చేయించానని సర్పంచ్‌ వజీర్‌ తెలిపారు. కొన్ని గ్రామాల్లోని సర్పంచులు మండల కేంద్రంలో భిక్షాటన చేసి మరీ రోగులకు అవసరమైన వస్తువులు కొనిచ్చారని చెప్పారు. బోనకల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బాలాజీ తాము క్యాంపులు నిర్వహిస్తున్నామనీ, డ్రై డేలు అమలు చేస్తున్నామని చెబుతున్నా ప్రజలు మాత్రం అలాంటివేం లేవన్నారు. ఏ సమస్య వచ్చినా ఖమ్మం ప్రఽభుత్వాసుపత్రికే వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రావినూతలలో చనిపోయిన కుటుంబాల్లో ఎక్కువ మంది మృతులు రైతు కూలీలు. వైద్యం నిమిత్తం రూ. 2-3 లక్షలకు తగ్గకుండా ఖర్చు చేశారు. అజ్మీరా సురేఖ (35) రూ. 3.30 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. చనిపోయి కొన్ని రోజులే అవుతున్నా వారి ఇంటిలో మరొకరికి కూడా డెంగ్యూ సోకడంతో కుటుంబమంతా ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లిపోయిన దీనమైన పరిస్థితి. పాలబోయిన సాయిసుధ (35) వ్యవసాయ కూలి. ఇద్దరు పిల్లలు. పొలం లేదు. దాంతో ఉన్న ఒకే ఒక గది ఇంటిని తాకట్టుపెట్టి చికిత్స చేయించినా తన భార్యను దక్కించుకోలేకపోయానని ఆమె భర్త సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం ఇంటి ముందు నిల్చుంటా 

‘‘ప్రభుత్వం తక్షణం హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలి. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలి. ఏ ఆధారం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి. జిల్లా మంత్రి తుమ్మల, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శకు రాకపోవడం విచారకరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇక్కడి పరిస్థితిపై నివేదిక ఇస్తా. నేను ఇంతవరకు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఈ విషయంలో కలువక తప్పదు. ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే స్పందన వచ్చే వరకు ఇంటి ముందు నిలుచుంటా.’’

- మల్లు భట్టి విక్రమార్క