‘డెంగీ’ ఖర్చు ప్రభుత్వమే భరించాలి: కుంతియా

ఖమ్మం: దేశంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో డెంగీ జ్వరంతో వంద మంది మృత్యువాత పడ్డారనీ, అక్కడ వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా డిమాండ్‌ చేశారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, మాజీ మంత్రి డీ శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పొం గులేటి సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌ తదితరులతో కలిసి శనివారం ఆయన రావినూతలలో పర్యటించారు. మృతుల కుటుంబాలను, డెంగీ రోగులను పరామర్శించారు. అనంతరం కుంతియా విలేకరులతో మాట్లాడుతూ.. పేదలు ఒంటి మీది నగలు అమ్ముకుని, భూములు తాకట్టు పెట్టి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేశారన్నారు. చికిత్స ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్నారు. పారిశుద్ధ్య లోపంతోపాటు మందులు స్ర్పే చేయకపోవడంతో దోమలు పెరిగి డెంగీ జ్వరాలతో ప్రజలు చనిపోయారన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 20లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పీసీసీ తరఫున ఒక బృందం గవర్నర్‌ను, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామన్నారు.