గర్భాశయ కేన్సర్‌ గుర్తింపు పరీక్ష రూ.200కే

బెంగళూరు, జనవరి 11 : ప్రస్తుతం గర్భాశయ కేన్సర్‌ గుర్తింపు పరీక్షకు రూ.900 దాకా అవుతోంది.. ఇకపై అందుకు రూ.200 చెల్లిస్తే సరిపోతుందని బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ ‘ఐంద్ర సిస్టమ్స్‌’ వ్యవస్థాపకుడు ఆదర్శ్‌ నటరాజన్‌ అంటున్నారు. రోగి నుంచి సేకరించే శాంపిళ్లను కృత్రిమ మేధ(ఏఐ)తో విశ్లేషించి.. కొన్ని గంటల్లోనే పరీక్ష ఫలితాలను వెల్లడించగల సరికొత్త వ్యాధి నిర్ధారణా పద్ధతిని అభివృద్ధిచేసినట్లు ఆయన వెల్లడించారు. ముందస్తుగా గర్భాశయ కేన్సర్‌ను గుర్తించడం ద్వారా.. బాధిత మహిళల ప్రాణాలు నిలపడానికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.