రూ.10కే సీబీసీ పరీక్ష

కోల్‌కతా, జనవరి 11 : కంప్లీట్‌ బ్లడ్‌ కౌంట్‌(సీబీసీ) అనేది ఓ ప్రత్యేక రక్తపరీక్ష. ల్యుకేమియా, ఎనీమియా, కేన్సర్‌, ఎముక మజ్జకు సంబంధించిన వ్యాధులను గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది. సీబీసీ పరీక్షకు చిన్నపాటి ఆస్పత్రుల్లో రూ.200 దాకా.. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.500 దాకా అవుతుంది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు రూ.10కే ఈ పరీక్ష చేయగల పరికరాన్ని అభివృద్ధి చేశారు. మోటార్‌ ఆధారంగా నడిచే స్పిన్నింగ్‌ డిస్క్‌తో అది పనిచేస్తుంది. పలుమార్లు రక్తపరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ డిస్క్‌ను పారవేసి, కొత్తదాన్ని అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది.