పేట్లబురుజు ఆస్పత్రిలో వింత శిశువు జననం

చార్మినార్‌/హైదరాబాద్ : పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శనివారం అవయవాలు అభివృద్ధి చెందని ఓ వింత శిశువు జన్మించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సయ్యద్‌ అఖిల్‌, సల్మాబేగం (27) భార్యాభర్తలు. సల్మాబేగం గర్భం దాల్చిన తర్వాత జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ నెల చికిత్స పొందేది. 7వ నెలలో వైద్యులు పరీక్షించి థైరాయిడ్‌ ఉందని హైదరాబాద్‌లోని పేట్లబురుజు ఆస్పతిక్రి పంపించారు. అప్పటి నుంచి పేట్లబురుజు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 9నెలలు నిండడంతో 3వ తేదీన సల్మాబేగం ఆస్పత్రికి వచ్చింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9-50నిమిషాలకు లింగ నిర్ధ్దారణ లేకుండా పూర్తిగా అవయవాలు, కాళ్లు, చేతులు ముఖం సరిగా లేని వింత శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు వింత శిశువుకు మెరుగైన చికిత్స కోసం నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, బరువు 2.5కిలోలు అని వైద్యులు తెలిపారు. జన్యులోపం వల్ల ఇలాంటి పిల్లలు పుడతారని, దీనిని హర్లిక్విన్‌ ఇచ్చయోసిన్‌ అని కూడా అంటారని పేర్కొన్నారు.