ఎయిడ్స్‌ బాధిత చిన్నారులతో రాశీ ఖన్నా దీపావళి

హైదరాబాద్‌: హీరోయిన్‌ రాశీ ఖన్నా ఐడీఏబొల్లారంలోని ఎయిడ్స్‌ బాధిత చిన్నారులతో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. ఆ చిన్నారుల మోముల్లో చిరునవ్వులు చిందించారు. వారితో కలిసి టపాసులు కాల్చి, నృత్యాలు చేసి ఉత్సాహపర్చారు. దీపావళి సందర్భంగా ఎయిడ్స్‌ బాధిత చిన్నారుల చికిత్సాలయం డిజైర్‌ సొసైటీలో శుక్రవారం రాత్రి జరిగిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. వారికి టపాసులను పంపిణీ చేశారు. అనంతరం దీపావళి కేక్‌ను కట్‌చేసి చిన్నారులకు ఇచ్చారు. వారు అందజేసిన బహుమతులను స్వీకరించారు. ఈ చిన్నారుల మధ్య దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని రాశీఖన్నా అన్నారు. వారికిస్తున్న రోజువారీ డైట్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. అభంశుభం తెలియని చిన్నారులకు ఎయిడ్స్‌ మహమ్మారి సోకడం బాధాకరమన్నారు.