ఈ మూడు వ్యాధులతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి..జర జాగ్రత్త!

ఆంధ్రజ్యోతి(19-10-2016): భారతదేశంలో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో సమస్యలు, పక్షవాతం వ్యాధుల వల్ల ఎక్కువమంది మరణిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మూడు వ్యాధులతో పాటు మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, అంటువ్యాధులైన న్యుమోనియా, అతిసారం, టీబీల వల్ల కూడా ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని తేలింది. ఈ వ్యాధులే కాకుండా రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువమంది మరణానికి దారితీస్తున్నాయని తాజా గణాంకాలు చెపుతున్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం లో 10.3 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఇందులో 60 శాతం మంది ఈ పది వ్యాధుల వల్ల మరణిస్తున్నారని సమాచారం. పాశ్యాత్య జీవనశైలి ఎంపిక వల్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రపంచంలోని 195 దేశాల్లో పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మరణాలకు కారణమవుతున్న వ్యాధుల సమాచారం వెల్లడైంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, యాంటీబయాటిక్స్ మందులతో సత్వర చికిత్స చేయించుకోవడం ద్వారా అంటు వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ అమిత్ సేన్ గుప్తా చెప్పారు. సురక్షితమైన తాగునీరు, పారిశుధ్యం లేకపోవడంతోపాటు నెలలు నిండకుండానే  ముందుగా పుట్టిన శిశువుల వల్ల మరణాలు సంభవిస్తున్నాయని డాక్టర్ అమిత్ సేన్ వివరించారు.