రాష్ట్రంపై ఎయిడ్స్‌ పడగ

 

ర్యాండమ్‌ టెస్టుల్లో బయటపడుతున్న హెచ్‌ఐవీ
వారంలో 18,809 మందికి పరీక్షలు.. 111 మందికి నిర్ధారణ
హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎయిడ్స్‌ విస్తృతి పెరుగుతున్నట్లు ఈ నెల 15 నుంచి రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాండమ్‌ స్ర్కీనింగ్‌ టెస్టుల ఫలితాలు సూచిస్తున్నాయి. మొత్తం 18,809మందికి పరీక్షలు చేయగా 111 మందిలో హెచ్‌ఐవీ బయటపడింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 3,879 మందికి ర్యాండమ్‌ స్ర్కీనింగ్‌ చేయగా 23 మందికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలింది. వరంగల్‌లో 21, హైదరాబాద్‌లో 12, మెదక్‌లో 12, నల్లగొండలో 10 కేసులు గుర్తించినట్లు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 51 ఎన్‌జీవోలు ఈ పరీక్షలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లో 5-6 ఎన్‌జీవోలు, 10మందికో బృందం చొప్పున 25 బృందాలు పనిచేస్తున్నాయి. ఎటువంటి వారిలో ఎక్కువగా హెచ్‌ఐవీ బయటపడిందనేది చివర్లో వెల్లడించనున్నారు.
 
పరీక్షలకు ఇలా ఎంచుకుంటారు?
శిక్షణ పొందిన ఆరోగ్యకార్యకర్త రక్త నమూనాలు సేకరించి హెచ్‌ఐవీ ఉందా లేదా? అనేది నిర్థారణ చేస్తారు. అంతకుముందు మిగిలిన సభ్యులు పరీక్షలు చేయించుకునే వారి నేపథ్యాన్ని తెలుసుకుంటారు. అఇందుకు స్మార్ట్‌ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానంలో ఎస్‌ అంటే వ్యక్తులకు పెళ్లి అయిందా.. లేదా? ఎమ్‌ అంటే తరచూ ప్రయాణం చేసేవారా? (మొబిలిటీ), ఏ అంటే డ్రగ్స్‌లాంటి వాటికి బానిసలా? (అడిక్ట్స్‌), ఆర్‌ అంటే రియాక్టివిటీ ఫర్‌ అదర్‌ ఇన్ఫెక్షన్స్‌( టీబీ లాంటివి) టీ అంటే రక్తం ఎక్కించుకోవడం (ట్రాన్స్‌ఫ్యూజన్‌) వంటివి ఉంటాయి. వీటిలో ఏదైనా ఏ ఒక్క కేటగిరీకి చెందిన వారైనా తప్పని సరిగా పరీక్షలు చేయించుకోవాలని బృందం సభ్యులు వారికి వివరిస్తారు. హెచ్‌ఐవీ ప్రాథమికంగా నిర్థారణ అయితే వెంటనే వారిని ఎలీసా పరీక్షలు కోసం ఐసీటీసీలకు పంపుతున్నారు.
 
పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు
కమ్యూనిటీ వైజ్‌గా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. హెచ్‌ఐవీ స్ర్కీనింగ్స్‌ చేయాలని చాలాచోట్ల సంస్థలు అడుగుతున్నాయి. వ్యక్తులూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కాలేజీలు, మునిసిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, పీహెచ్‌సీల నుంచి తమ వద్ద కూడా పరీక్షలు చేయమని అడుగుతున్నారు. ఎవరైనా మా వద్ద పరీక్షలు చేయించుకోవాలంటే టోల్‌ఫ్రీ నంబరు 1097కి కాల్‌ చేయాలి. ఇది 24 గంటలు పనిజేస్తుంది.
- డాక్టర్‌ అన్న ప్రసన్న కుమారి, రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ అదనపు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌