సర్కారు దవాఖానలకు 100 కోట్లు

సామాజిక బాధ్యతతో ఫార్మా కంపెనీల ఔదార్యం
పరికరాలు, మందులు, భవనాలకు వినియోగం
40 డయాలసిస్‌ యంత్రాలిస్తామన్న ఓ కంపెనీ
500 వెంటిలేటర్లు ఇస్తామన్న మరో కంపెనీ
ఫార్మా కంపెనీల సామాజిక బాధ్యత
మంత్రి ఈటలకు హామీ.. పది రోజుల్లో భేటీ

హైదరాబాద్‌/ఆబిడ్స్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు శుభవార్త. సర్కారు దవాఖానాలకు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ మొత్తాన్ని వివిధ రూపాల్లో ఆస్పత్రులకు ఇస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలిపాయి. మంత్రి ఆహ్వానం మేరకు 20 ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. రూ.100 కోట్లను నగదు రూపంలో కాకుండా.. ఆస్పత్రుల్లో పరికరాలు, మందుల కొనుగోలు, భవనాల నిర్మాణాలకు ఇవ్వాలని సూచించారు. దీంతో ఓ కంపెనీ 40 డయాలసిస్‌ యంత్రాలను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఒక్కో యంత్రం ఖరీదు రూ.6 లక్షల వరకు ఉంటుంది. మరో కంపెనీ 500 వరకు వెంటిలేటర్లు ఇస్తానంది. పెద్దమొత్తంలో మందులు ఇచ్చేందుకు ఇంకో కంపెనీ ఆసక్తి చూపించింది. పది రోజుల తరువాత పూర్తిస్థాయి ప్రతిపాదనలతో మరోసారి కలుస్తామని తెలిపాయి. మంత్రితో సమావేశమైన ఫార్మా కంపెనీల్లో డాక్టర్‌ రెడ్డీస్‌, హెటిరో, అరబిందో ఫార్మా, ఎంఎ్‌సఎన్‌ ల్యాబ్‌, నాట్కో, దివీస్‌, మైలాన్‌, భరత్‌ బయోటెక్‌, సైమండ్‌ ల్యాబ్స్‌, బల్క్‌ డ్రగ్‌ తయారీ అసోసియేషన్‌ తదితర కంపెనీలున్నాయి.

కోఠి ఈఎన్‌టీలో ‘ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌’
పుట్టుకతో చెవుడు సమస్యతో బాధపడే వారికి చేసే కాక్లియర్‌ శస్త్ర చికిత్సల కోసం కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రిలో కొత్తభవనం, ఆధునిక ఆపరేషన్‌ థియేటర్‌ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈమేరకు ‘ఆపరేషన్‌ థియేటర్‌ కాంప్లెక్స్‌’ భవనానికి శుక్రవారం మంత్రి ఈటల శంకుస్థాపన చేశారు. ఇది అందుబాటులోకి వస్తే రోజుకు ఒకటి నుంచి రెండు కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ చేయవచ్చని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.