పిల్లల వికాసానికి...

31-08-2019: రత్నాలాంటి గింజలతో తళతళ మెరిసే దానిమ్మ పండు తింటే చిన్నపిల్లల్లో మెదడు వికసిస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఏర్పడిన నాడీసంబంధ లోపాల్ని సరిచేయడం కష్టం. ఇంట్రా యుటెరైన్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌ సమస్యతో (ఐయుజిఆర్‌) బాధపడే నవజాతశిశివుల్లో మొదడు వికాసం తక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో పరిశోధన సాగించారు లండన్‌లోని బర్మింగ్‌హమ్‌ వర్శిటీ పరిశోధకులు. గర్భిణులు దానిమ్మ రసం తాగితే పుట్టే పిల్లల్లో మెదడు సంబంధ సమస్యల నుంచి రక్షణ లభిస్తుందా అనే కోణంలో స్టడీ చేశారు. అందులో గమనించిన ప్రాథమిక ఫలితాలను ‘ఫ్లస్‌ వన్‌’ జర్నల్‌లో ప్రచురించారు.దానిమ్మ రసం తాగిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో మెదడు వృద్ధి సవ్యంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రసంలో పాలీఫినాల్స్‌ టానిక్‌ యాసిడ్‌, ఎల్లాజిటానిన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. జంతువుల మీద చేసిన ప్రయోగాల్లో నాడీసంబంధ వ్యాధులను ఈ ఫినాల్స్‌ నిరోధించాయని తేలింది.