కమ్మని నిద్ర కోసం... స్లీప్ టానిక్

ఆంధ్రజ్యోతి (12-11-2019): రాత్రి కంటి నిండా నిద్ర పోయినప్పుడే మరుసటి రోజుకు అవసరమైన శక్తి సమకూరుతుంది. కానీ కొన్నిసార్లు ఎంత అలసటగా ఉన్నా నిద్ర కంటి మీదకు రాదు. ఇలాంటప్పుడు నిద్ర పట్టేలా చేసే ఈ ‘స్లీప్‌ టానిక్‌’ ఉపయోగించాలి.

 
బాదం పాలు ఇలా... ఈ పానీయం ప్రధానంగా బాదం పాలతో తయారవుతుంది. బాదం పాల తయారీకి నీళ్లలో కప్పు బాదం పప్పులు రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే తోలు తీసి, బ్లెండర్‌లో ముద్దలా చేసుకోవాలి. తర్వాత నాలుగు కప్పుల నీళ్లు, చిటికెడు హిమాలయన్‌ ఉప్పు చేర్చి తిప్పాలి. వడగట్టి పక్కన పెట్టుకోవాలి.
 
టానిక్‌ కోసం... రెండు కప్పుల బాదం పాలు, నాలుగు ఖర్జూరాలు, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, ఒక టేబుల్‌ స్పూను తేనె, అర టీస్పూను యాలకుల పొడి, పావు టీస్పూను కుంకుమ పువ్వు అవసరం అవుతాయి. పాన్‌లో బాదం పాలను వేడిచేసి ఈ పదార్థాలన్నీ కలిపి బ్లెండర్‌లో వేసి తిప్పాలి. తర్వాత గ్లాసులో నింపుకుని తాగాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తే కంటి నిండా కమ్మని నిద్ర పడుతుంది.