సీతాఫలం.. అలసట మాయం!

18-10-2019:శీతాకాలంలో విరివిగా దొరికే పండ్లలో సీతాఫలం ఒకటి. రుచిలో అనాస, అరిటిపండును పోలి ఉండే ఈ పండు పోషకాల రారాజు. సహజ చక్కెరలతో నిండిన ఈ ఫలం చర్మ, కురుల సోయగాన్ని పెంచుతుంది. ఈ సీజన్‌లో ప్రతిరోజు ఒక సీతాఫలం తింటే అలసట తగ్గిపోతుంది.

దీనిలో పీచుపదార్థం ఎక్కువ. ఇది రక్తంలోకి చక్కెర విడుదలను ఆలస్యం చేసి టైప్‌-2 డయాబెటీస్‌ రాకుండా చూస్తుంది.

ఈ పండు తింటే శరీరంలో నీటి నిల్వలు పెరుగుతాయి. అలసట తగ్గిపోతుంది.
సీతాఫలంలోని విటమిన్‌ సి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీరాడికల్స్‌ను తొలగించి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.
ఇందులోని కాపర్‌ కడుపు ఉబ్బరం, డయేరియా, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
సీతాఫలం ఆకుల కషాయాన్ని గాయాల మీద రుద్దితే త్వరగా మానిపోతాయి.
ఈ పండులో కార్బోహైడ్రేట్స్‌, పొటాషియం, ఫైబర్‌, విటమిన్లు, లవణాలు పుష్కలం. కొలెస్ట్రాల్‌ తక్కువ. సోడియం కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది.
డోపమైన్‌, సెరటోనిన్‌ వంటి న్యూరోట్రాన్స్‌మీటర్ల ఉత్పత్తికి అవసరమైన విటమిన్‌ బి6 సీతాఫలంలో సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్‌ బి6 ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, ఆస్తమాను నివారిస్తుంది.
ఈ పండు తింటే చర్మం మీద ముడతలు, గీతలు, తగ్గిపోతాయి. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
దీనిలోని విటమిన్‌ ఎ కళ్లు, వెంట్రుకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు గుజ్జును సెగగడ్డల మీద రాస్తే ఫలితం ఉంటుంది.
దీనిలోని ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కేన్సర్‌, గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. సీతాఫలంలోని మెగ్నీషియం, పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచుతాయి. హృదయ కండరాలను రిలాక్స్‌ చేస్తాయి.
సీతాఫలం గుజ్జుతో తేనె కలుపుకొని ప్రతిరోజు తింటే కావాల్సిన క్యాలరీలు అందడమే కాదు బరువు కూడా పెరుగుతారు.
గర్భిణులు సీతాఫలం తింటే పుట్టబోయే బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతాయి. పురిటి నొప్పులు కొంత వరకూ తగ్గుతాయి.
దీనిలోని సూక్ష్మపోషకాలు చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి. లిక్విడ్‌ ఫౌండేషన్‌ కన్నా మెరుగ్గా పనిచేస్తాయి.
ఈ పండు తింటే రక్తహీనత సమస్య ఉండదు. దీనిలోని ఐరన్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ నిల్వలను పెంచుతుంది.