వడదెబ్బ ప్రాణానికి ముప్పు

ఆంధ్రజ్యోతి, 01/05/15 : గొంతు ఎండిపోయి, ఒక మోస్తరుగా తలనొప్పి వస్తోందీ అంటే బహుశా అది వడదెబ్బ కావచ్చు. తీసుకునే నీటికంటే నీ నుంచి బయటికి వెళ్లి పోయే నీరు ఎక్కువైనప్పుడు వచ్చేదే ఈ వడదెబ్బ సమస్య. 

ఒంట్లో నీరు తగ్గిపోయినప్పుడు శరీరంలో ఉండే ఎలకో్ట్రలిటిక్‌ సమతుల్యత అస్తవ్యస్తమవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల శరీర వ్యవస్థ ప్రమాదంలో పడిపోతుంది. ఈ స్థితిలో వెంటనే సరియైున వైద్య చికిత్సలు అందకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌, బ్రెయిన్‌ డ్యామేజ్‌ వంటివే కాకుండా ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఈ ప్రాణాపాయ స్థితి ఏర్పడటానికి రోజులు, వారాలు కాదు, కొన్ని గంటలే చాలు.

ఎందుకిలా? 
తీవ్రమైన ఉష్ణోగ్రత, వేడివాతావరణంలో ఎక్కువ గంటలు ఉండడం, అతిగా వ్యాయామం చేయడం, అతి విరేచనాలు, వాంతులు, అతిగా మద్యపానం చేయడం వంటివి వడదెబ్బకు కారణం కావచ్చు. వీటికి తోడు తీవ్రమైన జ్వరం, విపరీతంగా చెమటలు రావడం, నియంత్రణలో లేని మధుమేహం, చర్మం మీద అయిన పెద్ద గాయాలు, చర్మ ఇన్‌ఫెక్షన్లు ఆహార, పానీయాలు తీసుకోలేని అశక్తత కూడా వడదెబ్బకు దారితీయవచ్చు.
 
ఎలా తెలుస్తుంది? 
ఎంతకూ తీరని దాహం, చర్మం ఎండిపోవడం, నీరసం, తలనొప్పి, మగతగా ఉండడం, మలబద్దకం, నోరు ఎండిపోవటం, జిగటగా ఉండటం, అతి తక్కువగా రావడంతో పాటు మూత్రం పసుపు రంగులో ఉండడం వడదెబ్బ లక్షణాలే.
 
తక్షణ జాగ్రత్తలు 
వడదెబ్బ వచ్చిందనే అనుమానం కలిగిన వెంటనే అదనంగా ఉన్న దుస్తుల్ని తీసివేయాలి. శరీరం చుట్టూ ఒక తడిబట్టను చుట్టాలి., ఎయిర్‌ కండీషనర్‌ గానీ ఫ్యాన్‌గానీ పెట్టాలి. ఒకేసారి కాకుండా చిన్న చిన్న గుక్కలుగా నీళ్లు తాగాలి. ఎలకో్ట్రలాయిట్స్‌ ఉన్న నీరైతే మరీ మంచిది. అయితే ఒంటిమీద ఐస్‌ప్యాక్స్‌ గానీ ఐస్‌ వాటర్‌ గానీ పెట్టకూడదు. పరిస్థితిలో ఏమీ మార్పు కనిపించకపోతే వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు వెంటనే చేర్చాలి. చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉంటే ఓఆర్‌ఎస్‌ ( ఓరల్‌ రీ-హైడ్రేషన్‌ సొలూషన్‌ ) ఇవ్వాలి. ఇవన్నీ చేశాక కూడా ఏమాత్రం మెరుగుదల కనిపించకపోతే వెంటనే శిశువైద్యనిపుణున్ని సంప్రదించాలి. 

వడదెబ్బ లక్షణాలు: 
ఎంతకూ తీరని దాహం, చర్మం ఎండిపోవడం, నీరసం, తలనొప్పి, మగతగా ఉండడం, మూత్ర ం అతి తక్కువగా రావడంతో పాటు పసుపు రంగులో ఉండడం ఇవన్నీ వడదెబ్బ లక్షణాలే.