స్లీపింగ్‌ ‘టిప్స్‌’

ఆంధ్రజ్యోతి, 11-6-15: రాతిళ్ర్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా. బెడ్‌ ఎక్కిన తరువాత ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదా. అయితే ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చండి... కనురెప్పలు మూసి కనుగుడ్లను గుండ్రంగా తిప్పండి... అని కొన్ని టిప్స్‌ చెప్తున్నారు నిపుణులు. వినేందుకు ఇవి సిల్లీగా అనిపించినా నిద్రలేమి సమస్యలను దూరం చేయడం మాత్రం ఖాయం అంటున్నారు వాళ్లు. క్రాంపెక్స్‌ ట్యాబ్లెట్లు తయారుచేసే కంపెనీ జరిపిన ఒక సర్వేలో 86 శాతం మంది నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడయ్యింది. ఇంత ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని సహజసిద్ధమైన టిప్స్‌, ట్రిక్స్‌ పాటిస్తే సరి అంటున్నారు నిపుణులు. 

 
ఎడమ ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఎలాగంటే... ఎడమ వైపు పడుకుని చేతి వేలితో కుడి ముక్కు రంధ్రాన్ని మూసి, ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శరీరంలో అధిక ఉష్ణోగ్రత వల్ల లేదా మెనోపాజ్‌ హాట్‌ ఫ్లషెస్‌ సమస్య వల్ల నిద్ర పట్టనప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపకరిస్తుంది.
 
కండరాలకు విశ్రాంతి కలిగిస్తే శరీరం నిద్రపోయేందుకు సిద్ధమవుతుంది. ఇందుకు... వెల్లకిలా పడుకుని ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కాలి బొటనవేళ్లను పాదం కిందకి అదిమేలా వంచి యథాస్థితికి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల కండరాలకు ఉపశమనం కలిగి నిద్ర మిమ్మల్ని పలకరిస్తుంది.
 
నిద్ర పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నిద్ర పట్టడం లేదు బాబోయ్‌ అంటుంటే ఇదేంటనుకుంటున్నారా.. అందులోనే ఉంది కిటుకు. దీన్నే ‘స్లీప్‌ పారడాక్స్‌’ అంటారు. ఇందులో భాగంగా కళ్లను విప్పార్చి ‘నేను నిద్రపోవడంలేదు’ అని పదేపదే అనుకోవాలి. సాధారణంగా మెదడు ప్రతికూల విషయాలను సరిగా ప్రాసెస్‌ చేయదు. అందుకని మీరు నిద్రపోవద్దని చెప్పుకునే మాటల్ని నిద్రపోవడానికి ఇచ్చే సజెషన్స్‌గా భావిస్తుంది. కంటి కండరాలు కూడా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు అని చెప్తున్నారు సైకోథెరపిస్టులు.
 
బుర్రలో ఉన్న బాధల భారాన్ని బయటికి పంపేయాలంటే ప్రాపంచిక విషయాలను రివర్స్‌లో గుర్తుచేసుకోవాలి. మీరు ఆ రోజున మాట్లాడిన విషయాలు, చూసిన ప్రదేశాలు, విన్న ధ్వనులు.. వంటి అన్ని విషయాలను వెనక నుంచి ముందుకు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దీని వల్ల మానసికంగా నిద్రకు సిద్ధమవుతారు. దాంతో నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండదు.
 
కళ్లు మూసుకుని కనుగుడ్లను మూడుసార్లు గుండ్రంగా తిప్పాలి. ఇలా చేయడం ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. అంతేకాకుండా మెలటోనిన్‌ అనే నిద్ర హార్మోన్‌ కూడా విడుదలవుతుంది.
 
చేయాల్సిన పనుల జాబితాను పడక మీద గుర్తుచేసుకుంటే నిద్ర రాదు. అందుకని పడక మీదకు చేరే ముందు ఒక పేపర్‌ మీద చేయాల్సిన పనులన్నింటినీ రాయాలి. ఇలా చేయడం వల్ల మరుసటిరోజు ఉదయం నిద్రలేచే వరకు వాటిని బుర్రలోనుంచి పక్కకు నెట్టేయొచ్చు. బుర్రలో ఆలోచనల భారం దిగిపోయాక నిద్ర రాకపోవడం అనే సమస్యే తలెత్తదు.