సొంత వైద్యం ప్రాణాలకే ప్రమాదం

ఆంధ్రజ్యోతి, 17-4-15: ఈ మధ్యకాలంలో డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలంటే చాలామంది వెనుకంజవేస్తున్నారు. వారి దగ్గరకు వెడితే తమకేం జబ్బుందో చెప్తారనే భయం కన్నా డాక్టర్లు రాసిచ్చే చాంతాడంత మందుల లిస్టు, వైద్య పరీక్షలను ఊహించుకుని చాలామంది వారి దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు. దానికి బదులు తమ బంధువులనో, స్నేహితులనో సంప్రదించి మందులను వాడేస్తున్నారు. ఇటీవల లైబ్రేట్‌ అనే ఆన్‌లైన్‌ హెల్త్‌ పోర్టల్‌ నిర్వహించిన ఒక సర్వేలో ఇండియాలో దాదాపు 52 శాతంమంది ప్రజలు సెల్ఫ్‌మెడికేషన్‌కు బాగా అలవాటుపడ్డారని వెల్లడైంది. సర్వేలో భాగంగా దేశంలోని 10 నగరాల్లోని 20,000 మంది ప్రజలను ఇంటర్వ్యూ చేశారు. ప్రజలలో పెరిగిన సెల్ఫ్‌మెడికేషన్‌ అలవాటు వల్ల దేశంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ బాగా పెరిగిపోతోందని వైద్యులు ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల రోగ నిర్థారణ కూడా ఆలస్యమవుతోందంటున్నారు. అంతేకాదు సొంత నిర్ణయాలతో మందులు వాడడం వల్ల కూడా ప్రజలు రకరకాల ఎలర్జీలకు గురవుతున్నారుట. ఇలా సొంతంగా మందులు ఎందుకు వాడుతున్నారని అడిగితే డాక్టర్‌ దగ్గరకు వెళ్లడానికి సమయం ఉండటంలేదని జవాబు చెప్పారు. అంతేకాదు డాక్టర్‌ ఫీజు మోతనుంచి తప్పించుకోవడానికి కూడా వైద్యుల దగ్గరకు వెళ్లడం లేదని తెలిపారు. ఇంకొందరు తమ సింప్టమ్స్‌ను బట్టి మందులను ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి వాడుతున్నట్టు వివరించారు.

 
ఈరకంగా ఇష్టం వచ్చినట్టు మందులు వాడడం వల్ల లివర్‌ దెబ్బతినడం, స్ట్రోక్ రావడం, మూత్రపిండాలు దెబ్బతినడం, డయేరియా, గర్భస్రావం వంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సొంతంగా మందులు వాడడం ప్రమాదకరమన్న అవగాహన చాలామందిలో లేదు. చిన్న అనారోగ్య సమస్యలే కదా అని ఇష్టంవచ్చినట్టు సొంతవైద్యం చేసుకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మనదేశంలో మందులు ఓవర్‌ ది కౌంటర్‌ లభించడం. దీని వల్ల కూడా ప్రజలు మందులను ఇష్టంవచ్చినట్టు వాడుతున్న పరిస్థితి ఉంది. ఇలా సొంతంగా మందులు వాడడం పేషంటుకు మంచి చేయడం కన్నా చెడే ఎక్కువ చేస్తుంది. సెల్ఫ్‌మెడికేషన్‌ చిన్న విషయమేమీ కాదు. దీని వల్ల కలిగే ఎన్నో దుష్ప్రభావాలను ప్రజలను తెలియజెప్పడానికి ఈ సమస్యపై లైబ్రేట్‌ ప్రత్యేకంగా ఒక అవగాహనా కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేపట్టనుంది. అంతేకాదు సెల్ఫ్‌మెడికేషన్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు www.SayNoToSelfMedication.org అనే ప్రత్యేకమైన పోర్టల్‌ను కూడా పారంభించింది.ళిచి÷్చల÷