గురక పెడుతున్నారా?

15-10-2019: రోడ్‌ రోలర్‌ కంకర రోడ్డు మీద నడుస్తున్నట్టు... ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాల మీద పరుగులు పెడుతున్నట్టు.... ఇద్దరు రాక్షసుల మధ్య భీకరమైన పోరు జరుగుతున్నట్టు... కొందరి గురక వింటే, ఇలాగే అనిపిస్తుంది మరి! వాళ్లను చూస్తే... మిగతావాళ్లకు నిద్ర లేకుండా చేసి, ఎంత హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అనుకుంటాం! కానీ నిజానికి గురక వల్ల పక్కవారికి కలిగే అసౌకర్యం కంటే... గురక పెట్టేవాళ్ల ఆరోగ్యానికి జరిగే నష్టమే ఎక్కువ! గుండెపోటుతో నిద్రలోనే ప్రాణం పోయిన సంఘటనలలో స్లీప్‌ ఆప్నియా జరిగి ఉండే అవకాశాలు ఎక్కువ. అయితే గుండెపోటే ప్రధాన కారణంగా తేలినప్పుడు, అందుకు కారణమైన స్లీప్‌ ఆప్నియా మీదకు దృష్టి మళ్లదు. ఈ స్లీప్ ఆప్నియాకు గురకే కారణమని తెలుసా..?
 
గురక తప్పాలంటే?
 
గురక రాకుండా ఉండాలంటే అందుకు కారణమయ్యే అంశాలను నియంత్రించుకోవాలి. స్థూలకాయం రాకుండా క్రమం తప్పక వ్యాయామం చేయడంతో పాటు, సమతులాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు....
వెల్లకిలా పడుకుని నిద్రపోతే, నాలుక గొంతులోకి జారే అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కకు తిరిగి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
తల కింద ఎత్తు ఉంచి పడుకోవాలి.
మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యపానం చేస్తే ఆ మత్తులో శ్వాసనాళం దగ్గరి కండరాల మీద నియంత్రణ కోల్పోతాం. ఫలితంగా గురక మొదలవుతుంది. అది స్లీప్‌ ఆప్నియాకు దారి తీయవచ్చు.
 
పిల్లలు మొదలుకుని పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో నిద్రలో గురక పెడతారు. గురక అంత సహజమైన చర్య. గురక పెట్టి నిద్రపోతే బాగా నిద్ర పోయారని అనుకుంటాం. కానీ నిజానికి గురక వల్ల గాఢనిద్రలోకి జారుకునేలోపే మెలకువ అయిపోతూ ఉంటుంది. ఇలా రాత్రంతా పదే పదే జరిగితే కంటి నిండా నిద్ర కరువవుతుంది. దాంతో పగలంతా మత్తుగా తూగుతూ ఉంటాం. పనులు సక్రమంగా చేసుకోలేం. రోజంతా నిస్సత్తువగా గడిపేస్తాం. ఫలితంగా జీవన నాణ్యత దెబ్బతింటుంది. అంతకుమించి ఆక్సిజన్‌ సరిపడా అందక ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి ఇన్ని ఇబ్బందులకు గురిచేసే గురక ఎందుకొస్తున్నట్టు? రాకుండా మార్గమే లేదా?
 
గురకతో స్లీప్‌ ఆప్నియా!
గురకకు కారణం శ్వాసనాళంలో ప్రకంపనలకు గురయ్యే మెత్తని కణజాలమే! లోపలికి, బయటకు వెళ్లే గాలి కారణంగా గొంతులో ఉండే కండరాలు కదలికలకు లోనై శబ్దాన్ని వెలువరుస్తాయి. అయితే సాధారణంగా నిద్రలో ఉన్నప్పుడు గురకతో మనంతట మనకే మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనల్ని నిద్ర లేపేది గురక శబ్దం కాదు. ఆ సమయంలో శ్వాసనాళం కుంచించుకుపోయి, మెదడుకు సరిపడా గాలి అందకపోవడం వల్ల శరీరం తనంతట తాను అప్రమత్తమై, నిద్ర మెలకువ అయిపోతుంది. ఇదంతా మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. అయితే గురక శబ్దం ప్రమాదకరమైనది కాకపోయినా, గురకతో పాటు నిద్రలో శ్వాస ఆగిపోయే స్థితి ‘స్లీప్‌ ఆప్నియా’ ఒకింత ప్రమాదకరమే! పడుకున్న భంగిమలో నాలుక, కొండ నాలుక శ్వాసనాళం మీద పడిపోయి ఆ మార్గాన్ని ఇరుకుగా మార్చేసే ఈ పరిస్థితి ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. అయితే ఇలా ఒక రాత్రిలో ఎన్ని సార్లు జరుగుతోంది? ఎంత సేపు శ్వాసకు ఆటంకం ఏర్పడుతోంది? అనే విషయాలను గమనించుకోవాలి. ఆరోగ్య నష్టం వాటి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.
 
అంతా నిద్రలోనే....
శ్వాసకు ఎక్కువ సమయంపాటు ఆటంకం ఏర్పడితే మెదడుకు సరిపడా ఆక్సిజన్‌ అందదు. ఈ స్థితి గుండె మీద ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. సాధారణంగా గుండెపోటుతో నిద్రలోనే ప్రాణం పోయిన సంఘటనలలో స్లీప్‌ ఆప్నియా జరిగి ఉండే అవకాశాలు ఎక్కువ. అయితే గుండెపోటే ప్రధాన కారణంగా తేలినప్పుడు, అందుకు కారణమైన స్లీప్‌ ఆప్నియా మీదకు దృష్టి మళ్లదు. కానీ నిజానికి స్లీప్‌ ఆప్నియా గుండెపోటుకు దారితీస్తుంది.
 
గురకకు కారణాలు బోలెడు!
స్థూలకాయం, నాలుక పెద్దగా ఉండడం, కొండ నాలుక పెద్దగా ఉండడం, దవడల నిర్మాణంలో తేడాలు ఉన్నవారికి గురక సహజం. ఇవన్నీ శ్వాసనాళానికి అడ్డంకులుగా మారతాయి. అయితే గురకతో నిద్రకు ఆటంకం కలిగే పరిస్థితులు కూడా రెండు రకాలుగా ఉంటాయి. నిద్రలో గురక వల్ల మెలకువ అయిపోవడం, అసలు నిద్రలోకే జారిపోలేకపోవడం. ఈ రెండు ఇబ్బందులూ స్లీప్‌ ఆప్నియాను కలిగించేవే! అయితే ఎంత తరచుగా నిద్ర మెలకువ అయిపోతోంది? మెలకువ అయ్యేలోగా ఎంత ఆక్సిజన్‌ లోపం కలుగుతోంది? ఎంతసేపు ఆక్సిజన్‌ ప్రసారంలో ఆటంకం కలుగుతోంది? అనే
 
విషయాలను కనిపెట్టే పరీక్షలు ఉన్నాయి. అవేంటంటే....
స్లీప్‌ స్టడీ: నిద్రపోయే సమయంలో రాత్రంతా నిద్ర ప్యాటర్న్‌ను పరిశీలించే పరీక్ష ఇది. గురకతో పాటు శ్వాస ఎన్నిసార్లు, ఎంతసేపు ఆగిపోయింది? అలా ఆగడం వల్ల శరీరంలో తగ్గిన ఆక్సిజన్‌ గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.
డైనమిక్‌ ఎమ్మారై: నిద్రలో ఉన్న సమయంలో శ్వాసకు నాలుక, కొండ నాలుక, శ్వాసనాళం చుట్టూ ఉండే కండరాల వల్ల గురక మొదలవుతుంది. అయితే వీటిలో దేని వల్ల గురక తలెత్తి, నిద్రాభంగం కలుగుతోందో ఈ పరీక్షతో తెలుస్తుంది.
డ్రగ్‌ ఇండ్యూస్‌డ్‌ స్లీప్‌ ఎండోస్కోపీ: మందులతో నిద్రమత్తులోకి తీసుకువెళ్లి, గొంతులోకి ట్యూబ్‌ను పంపి, గురకకు కారణమయ్యే పరిస్థితిని కనిపెట్టే పరీక్ష ఇది. దీంతో అసలు కారణం కచ్చితంగా తెలుసుకోవచ్చు.
 
చిన్నప్పుడే....
ఈ సమస్యను చిన్నప్పుడే గుర్తిస్తే సరిచేయడం తేలిక. పిల్లల్లో గురకను గమనిస్తే, ఇ.ఎన్‌.టి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. వారిలో ఎడినాయిడ్స్‌, టాన్సిల్స్‌ పెరుగుతున్నాయేమో గమనించుకుంటూ ఉండాలి. ఇవి శ్వాసనాళానికి అడ్డుపడి గురక వస్తూ ఉండవచ్చు. ఈ సమస్య స్లీప్‌ ఆప్నియాకు దారి తీయవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా వైద్యుల చేత పరీక్ష చేయిస్తూ ఉండాలి.
 
నిర్లక్ష్యం చేస్తే?
గురక శబ్దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ పక్కన ఉన్నవాళ్లకు కలిగే అసౌకర్యం కంటే, గురక పెట్టేవారికి కలిగే ఆరోగ్య నష్టమే ఎక్కువ. గురక వల్ల మొదలయ్యే స్లీప్‌ ఆప్నియాతో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా దీర్ఘకాలం కొనసాగితే రక్తపోటు పెరుగుతుంది. హైపర్‌టెన్షన్‌, మధుమేహం సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
 
గురకకు చికిత్స!

గురకకు కారణాలు ముక్కు నుంచి గొంతు వరకూ ఉండే మార్గంలో ఎక్కడైనా ఉండవచ్చు. కొందరికి ముక్కు దూలం వంకర ఉండి, ఆ కారణంగా గురక వస్తూ ఉండవచ్చు. ఇంకొందరికి కొండనాలుక లేదా నాలుక పెద్దవిగా ఉండి, అవి గురకకు కారణం కావచ్చు. మరికొందరికి శ్వాసనాళం చుట్టూ ఉండే మెత్తని కణజాలం ప్రకంపనలకు గురై, గురకకు దారితీస్తూ ఉండవచ్చు. దవడల నిర్మాణంలో తేడాల వల్ల కూడా గురక వస్తూ ఉండవచ్చు. ఇలా కారణాన్ని బట్టి చికిత్సలు ఆధారపడి ఉంటాయి. చికిత్సలో ప్రధానంగా సాఫ్ట్‌ టిష్యూ సర్జరీ లేదా స్కెలెటల్‌ సర్జరీలను ఎంచుకోవచ్చు. సాఫ్ట్‌ టిష్యూ సర్జరీలో భాగంగా టాన్సిల్స్‌, అడినాయిడ్‌, నాలుక, కొండనాలుక, స్వరపేటికలో లోపాలను సరిచేస్తారు. స్కెలెటల్‌ సర్జరీలో గురకకు ఆస్కారం లేకుండా దవడలను సరిచేస్తారు. 

 
సర్జరీతో పనిలేని ‘సీపాప్‌’!

గురక పెట్టే ప్రతి ఒక్కరూ సర్జరీ చేయించుకోవలసిన అవసరం లేదు. గురకతో నిద్రాభంగం కలగకుండా చేసే నోట్లో అమర్చుకునే పరికరాలు ఉన్నాయి. వీటిని అమర్చుకుంటే దవడ ముందుకు వచ్చి, నాలుక వెనక్కి పడిపోకుండా ఉంటుంది. అలాగే స్లీప్‌ ఆప్నియాను నియంత్రించే పరికరం సీపాప్‌ కూడా ఉపయోగించవచ్చు. ఇది శ్వాసనాళాల్లోకి గాలిని బలంగా పంపిస్తూ, గాలి అందక నిద్ర మెలకువ అయిపోయే పరిస్థితి నుంచి తప్పిస్తుంది. ఈ పరికరాలతో కూడా ఉపయోగం లేని తీవ్రమైన గురక సమస్య ఉన్నవారికి మాత్రమే సర్జరీ అవసరమవుతుంది.

డాక్టర్‌ గౌతమ్‌ దెందుకూరి
కన్సల్టెంట్‌ డెంటల్‌ అండ్‌ మాక్సిలోఫేషియల్‌ సర్జన్‌,
హైదరాబాద్‌