ఆయుర్దాయానికి వివాహమే కీలకం

ఆంధ్రజ్యోతి, 18/02/14:  పెళ్లికి, ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి అవినాభావ సంబంధం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. జీవితంలో పెళ్లి చేసుకోనివారు 60 ఏళ్లకు మించి బతకడం లేదని అమెరికా డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కి చెందిన డాక్టర్‌ ఐలెన్‌ సీగ్లర్‌, ఆయన సహచరులు వెల్లడించారు. వారంతా కలిసి, 1940ల తరువాత పుట్టి ఈ శతాబ్దం ప్రారంభంలో గుండె జబ్బుతో మరణించిన ఓ 4800 మంది వివరాలను సేకరించి నార్త్‌ కరోలినా అలూమ్ని హార్ట్‌ స్టడీ సెంటర్‌లో అధ్యయనం చేశారు. ముఖ్యంగా నడివయసులో అర్ధాంగి లేకపోతే మాత్రం అర్ధాయుష్షులు కాక తప్పడం లేదని డాక్టర్‌ సీగ్లర్‌ చెప్పారు. 

నలభయ్యేళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారిలో చాలామందికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. వారిలో ధైర్యం సన్నగిలే సమయం అది. అటువంటి సమయంలో జీవిత భాగస్వామి పక్కనుంటే, ఆ ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి కొరత ఉండదు. అటువంటి సమయంలో ధైర్యంగా ఉండగలిగితే, ఆ తరువాత ఆరోగ్యానికి ఢోకా ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. 40-60 ఏళ్ల మధ్య వివాహితులుగా ఉన్నవారు, వివాహం కానివారు అనే రెండు వర్గాలుగా విభజించి, వందలాది మంది మీద వారు అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనవేత్తలతో కొందరు మానిసిక వైద్య నిపుణులు కూడా కలిసి, అవివాహితుల మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించారు.
 
జీవితంలో అసలు పెళ్లే చేసుకోనివారి ఆరోగ్యాలను కూడా వారు ప్రత్యేకంగా పరిశీలించారు. వారిలో గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వారి పరిశీలనలో తేలింది. పెళ్లి విఫలమైనవారి కన్నా పెళ్లి విజయవంతం అయి, నడి వయసులో చక్కగా కుటుంబ జీవితం గడుపుతున్నవారిలో అనారోగ్య సమస్యలు తగ్గి, ఆయుర్దాయం పెరుగుతున్నట్టు కూడా వారు చెప్పారు. పెళ్లి విఫలమైనవారిలో నడి వయసు దాకా వచ్చిన వారి సంఖ్య కూడా తక్కువగానే ఉందని తెలిసింది. మధ్యలో విడాకుల ద్వారా విడిపోయినవారు, నడి వయసు కూడా రాక ముందే జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, విభేదాలలో మునిగి తేలుతున్నవారు కూడా దీర్ఘకాలం బతకడం లేదని, పైగా తరచూ అనారోగ్యాలకు గురి కావడం జరుగుతోందని సీగ్లర్‌ వివరించారు. 

దాంపత్య జీవిత రహస్యం 
అర్ధాయుష్షులుగా మరణించడానికి అవకాశమిచ్చే ఇతర కారణాలన్నిటికన్నా పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకోకపోవడం వంటి కారణాల బలం మరీ ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. వారి జీవనశైలి, చిన్నప్పటి ఆరోగ్యం వంటి కారణాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ, పెళ్లికి, అనారోగ్యాలకు, ఆయుర్దాయానికి మాత్రం బాగా దగ్గర సంబంధం ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. దీర్ఘాయుర్దాయాన్ని అనుభవిస్తున్నవారిలో 99 శాతం మంది వివాహం చేసుకున్నవాళ్లేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా నడివయసులో జీవిత భాగస్వామి పక్కన ఉండడం ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి చాలా అవసరంగా కనిపిస్తోందని కూడా ఆయన తెలపారు.
 
యవ్వనం నుంచి నడి వయసులోకి ప్రవేశిస్తున్నప్పుడు లేదా నడివయసు నుంచి వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, మనోధైర్యం దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. జీవిత భాగస్వామి సాహచర్యం మనసుకు ధైర్యం ఇవ్వడమే కాకుండా, శరీరంలో జవసత్వాలను నింపుతుంది. దీన్ని బట్టి చూస్తే జీవితంలో పెళ్లి పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది. నడివయసులో అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్లు తప్పనిసరిగా రోగిని వైవాహిక స్థితిగతుల గురించి ప్రశ్నించి తెలుసుకోవాల్సి ఉంటుందని డాక్టర్‌ సీగ్లర్‌ తెలిపారు.
 
నిజానికి 1858 ప్రాంతంలోనే విలియం ఫార్‌ అనే ఫ్రాన్స్‌ వైద్య నిపుణుడు జీవితంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యం గురించి తన మొదటి నివేదికను ప్రపంచానికి అందించారు. అప్పట్లో భారీ స్థాయిలో అధ్యయనాలు జరిపే అవకాశం లేనందువల్ల ఆయన తన వద్దకు తండోపతండాలుగా వచ్చే రోగులనే పరిశీలించి ఓ రికార్డు రూపొందించారు. తన దగ్గరకు వచ్చిన రోగుల్ని ఆయన వివాహితులు, అవివాహితులు, విడాకులు పొందినవారు (లేక జీవిత భాగస్వామి మరణించినవారు) అని మూడు వర్గాలుగా విభజించారు. ఆయన వారి జన్మ, మరణ తేదీలను నమోదు చేసుకుని, వారి అనారోగ్యాలను విశ్లేషించారు. ఇందులో అవివాహితులు, విడాకులు పొందినవారు లేక జీవిత భాగస్వామిని కోల్పోయినవారికి ఓ వ్యాధి వచ్చినా అది వారిపై మామూలు కంటే రెట్టింపు ప్రభావాన్ని కనబరుస్తుందని ఆయన తెలిపారు. ఉదాహరణకు, పెళ్లయినవారు గుండెపోటు రెండుసార్లు వచ్చినా తట్టుకోగలుగుతారు. కానీ, జీవిత భాగస్వామి లేనివారు ఒకసారి గుండెపోటుకు గురయినా బతకడం కష్టం అవుతుంది. 

పెళ్లితోనే ఆరోగ్యం 

పెళ్లి వల్ల ఆరోగ్యం సజావుగా కొనసాగుతుంది. ఆరోగ్యం క్షీణిస్తోందంటే అందుకు వైవాహిక జీవితంలోని సమస్యలు చాలా వరకూ కారణం అవుతాయి. సాధారణంగా వివాహితులే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంది. ‘‘అసలు కుటుంబ జీవితమే ఆరోగ్యానికి మొదటి సోపానం’’ అని ఫార్‌ చెప్పారు. ‘‘ఒంటరి జీవితం గడిపేవారు తొందరగా కుప్పకులుతారు. జంటగా ప్రయాణించేవారు ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగిస్తారు’’ అని ఆయన వివరించారు. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఆయన ఆరోగ్య రహస్యానికి ఇప్పటికీ విలువ ఉందని, పెళ్లి అనే కన్నా స్ర్తీ పురుషులు కలిసి ఉండడమనే వ్యవస్థకు ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుందని సీగ్లర్‌ చెప్పారు. దీన్లో లైంగిక సంబంధాలు కొనసాగడమనేది కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
 
కాగా, సమకాలీన అధ్యయనాలను బట్టి తేలుతున్నదేమిటంటే, పెళ్లి చేసుకుని, దాంపత్య జీవితం గడుపుతున్నవారిలో గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, న్యుమోనియా, క్యాన్సర్‌, మతిమరుపు వంటి అనారోగ్య సమస్యలు చాలా తక్కువ. నడివయసులోనూ లైంగిక సంబంధాలను ఉత్సాహంగా కొనసాగించగలిగినవారు అనేక మొండి వ్యాధులకు అతీతంగా బతకగలుగుతారని, ఒకవేళ ఇతర కారణాల వల్ల అనారోగ్యాల బారినపడి ఉన్నప్పటికీ, వారిలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు.
 
స్వీడెన్‌లో ఇటీవల జరిగిన మరో అధ్యయంలో తేలిందేమిటంటే, పెళ్లి చేసుకున్నవారు కూడా కలిసిమెలిసి ఉండగలిగినప్పుడే అనారోగ్యాలకు అతీతంగా బతకగలుగుతారు. పెళ్లి చేసుకున్నప్పటికీ, ప్రతి రోజూ విభేదాలు, వాగ్వాదాలతో వైవాహిక జీవితాన్ని గడిపేవారిలో గుండె జబ్బులకు గురికావడం ఎక్కువగానే ఉందని అది తెలిపింది. మరో విశేషమేమిటంటే, పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం లేక జీవిత భాగస్వామి మధ్యలో మరణించడం వంటి కేసులతో పోలిస్తే అసలు వివాహమే చేసుకోనివారి పరిస్థితి ఆరోగ్యపరంగా కాస్తంత మెరుగ్గానే ఉంటుందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. 

సరైన జీవిత భాగస్వామి 

సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నవారు ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి సందేహించాల్సిన అవసరం ఉండదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి, సరైన జీవిత భాగస్వామి, సజావైన లైంగిక జీవితం ఉన్నవారికి రోగ భయం లేని దీర్ఘాయువు తప్పదని ఫార్‌ చెప్పారు. అర టే వివాహ బంధం కంటే, వ్యక్తిగత బంధం చాలా ముఖ్యం. సరైన వివాహ జీవితం మానసిక ఒత్తిడికి సరైన విరుగుడు. దాంపత్య జీవితాన్ని చక్కగా గడుపుతున్నవారిలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాక, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి చక్కని వైవాహిక జీవితం సోపానం అవుతుంది. అందువల్ల సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంపై యువతీ యువకులు సరైన శ్రద్ధ చూపించాల్సి ఉంటుందని ఈ అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
 
బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల్లో విడాకుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో వైద్య నిపుణులు ‘జీవితంలో వైవాహిక జీవిత ప్రాధాన్యం’ మీద అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలతో అధ్యయనాలు జరిపిస్తున్నాయి. ఈ అధ్యయనాల నివేదికలను ఆన్‌లైన్‌ ద్వారానే కాకుండా పుస్తకాల రూపంలో కూడా ప్రజల్లోకి పంపించడం జరుగుతోంది. ఆనందంగా, ఆరోగ్యంగా దీర్ఘకాలం బతకడానికి వైవాహిక జీవితం ఎంత అవసరమో చెబుతున్న ఈ నివేదికలు, కౌన్సెలింగ్‌ కేంద్రాలకు, ఫ్యామిలీ కోర్టులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.