వెక్కిళ్లు తగ్గేందుకు...!

30-10-2019: వేగంగా ఆహారం తింటున్నప్పుడు, నీళ్లు లేదా ఇతర పానియాలు గబగబా తాగుతున్నప్పుడు వెక్కిళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు ఏం చేయాలో పాలుపోదు. అయితే వంటగదిలోని చక్కెర, ఐస్‌వాటర్‌, తేనె వంటి పదార్థాలు వెక్కిళ్లను క్షణాల్లో మాయం చేయగలవు. ఎలాగో చూద్దాం...
 
చెమ్చాడు చక్కెర: ఒక స్పూను చక్కెర వెక్కిళ్ల నుంచి సత్వర ఉపశమనాన్ని ఇస్తుంది. వెక్కిళ్లను ఆపేందుకు చాలామందికి తెలిసిన పద్ధతి ఇది.
తేనె, వేడినీళ్లు: నాలుక కింది భాగంలో కొద్దిగా తేనె కలిపిన నీళ్లను కొద్దిసేపు ఉంచుకొని మింగాలి. అలానే కొద్దిసమయం శ్వాస ఆపి ఉంచితే వెక్కిళ్లు తగ్గిపోతాయి.
ఐస్‌ వాటర్‌: కొద్దిగా ఐస్‌వాటర్‌ను నోట్లో వేసుకొని పుక్కిలించాలి. ఇలాచేస్తే కండరాలు అకస్మాత్తుగా పట్టేయడం తగ్గి, వెక్కిళ్ల సమస్య తగ్గుతుందని న్యూయార్క్‌కు చెందిన కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
నిమ్మరసం: వెక్కిళ్లు వచ్చినప్పుడు నిమ్మపండు కొరికి రసం తాగితే చాలు చిటికెలో ఉపశమనం లభిస్తుందని ఒక పరిశోధనలో వెల్లడయింది.