ఆరోగ్య మొలకలు!

11-10-2019: అల్పాహారంగానో, స్నాక్స్‌గానో మొలకెత్తిన గింజల్ని తినడం మంచి అలవాటు. రోజుకో కప్పు స్పౌట్ర్స్‌ తింటే కంటి చూపు మెరుగవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. ‘పవర్‌ హౌజ్‌ ఆఫ్‌ ఎంజైమ్స్‌’గా పిలిచే వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలివి.
మొలకల్లోని ఎంజైమ్‌లు ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు కారణమయ్యే ఎంజైమ్‌ల పనితీరును నిరోధిస్తాయి.
స్పౌట్ర్స్‌లోని విటమిన్స్‌, మినరల్స్‌, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఎర్రరక్తకణాల్లో ఐరన్‌, కాపర్‌ శాతం తగ్గిపోకుండా చేసి రక్తహీనత ముప్పును అడ్డుకుంటాయి. అంతేకాదు అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాను పెంచుతాయి. హృదయ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
వీటిని సలాడ్‌గా లేదా నేరుగా తినొచ్చు. పోషకాలు సమృద్ధిగా, క్యాలరీలు తక్కువగా ఉండే వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. తేలిగ్గా బరువు తగ్గొచ్చు.
గర్భిణులు స్పౌట్ర్స్‌ తింటే వారికి అవసరమైన ఫోలిక్‌ ఆమ్లం లభిస్తుంది. వీటిలోని సెలీనియం పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుంది.
మొలకల్లోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తి పెంచడమే కాదు తెల్లరక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
మొలకెత్తిన గింజల్లోని విటమిన్‌ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి కళ్లను కాపాడతాయి.
వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ నిల్వల్ని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ నిల్వల్ని తగ్గిస్తాయి. వీటిలోని పొటాషియం రక్తపీడనాన్ని అదుపులో ఉంచి గుండె సంబంధ జబ్బుల నుంచి రక్షణనిస్తుంది.
మొలకలు శరీరంలోని ఆమ్లాలను తగ్గించి పీహెచ్‌ను బ్యాలెన్స్‌ చేస్తాయి.
స్పౌట్ర్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చర్మ కేన్సర్‌ను నివారిస్తాయి. వీటిలోని పోషకాలు కురుల కుదుళ్లకు పోషణనిచ్చి, వెంట్రుకలు దృఢంగా, ఆరోగ్యంగా పెరిగేలా సాయపడతాయి.
మొలకెత్తిన గింజలు తింటే కొత్త కణాల వృద్ధితో పాటు ఎముకల దృఢత్వం పెరుగుతుంది.