ఉప్పుతో మెప్పు పొందొచ్చు!

24-08-2019: ఆహారంలో రుచి కోసమే కాదు అందాన్ని ఇనుమడింపచేయడంలో కూడా ఉప్పును వాడొచ్చు. దీనిలోని లవణాలు దంతాలు మెరిసేలా, గోళ్లు తళతళలాడేలా చేస్తాయి. ఉప్పు సౌందర్య సాధనంగా ఎలా పనిచేస్తుందంటే...
 
చర్మం తాజాగా: టీ స్పూన్‌ ఉప్పును సగం కప్పు వేడినీళ్లలో కలపాలి. ఈ నీటిలో కాటన్‌ బాల్‌ను ముంచి కళ్ల చుట్టూ కాకుండా ముఖం మొత్తం రుద్దుకోవాలి. దీంతో ఫేషియల్‌ ఆయిల్‌ తొలగిపోతుంది. వారానికి ఒకసారి ఇలాచేస్తే చర్మం తాజాగా, కాంతిమంతంగా మారుతుంది.
 
చుండ్రు మాయం: ఆలివ్‌ నూనె, ఉప్పు సమపాళ్లలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. చర్మం మీది మృత కణాలు తొలగి, చర్మ కణాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే, చుండ్రు సమస్య తగ్గుతుంది.
 
ఫేస్‌మాస్క్‌: నాలుగు టీ స్పూన్ల వడబోయని తేనెలో రెండు టీస్పూన్ల ఉప్పు కలిపి, పేస్ట్‌లా చేసుకోవాలి. కళ్ల చుట్టూ వదిలేసి ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా పట్టించాలి. వేడినీళ్లలో ముంచి, నీళ్లు పిండేసిన చిన్న వాష్‌క్లాత్‌ను ముఖం మీద అరనిమిషం పాటు ఉంచాలి. తరువాత చేతివేళ్లతో వలయాకారంలో రుద్దుకుంటూ గోరువెచ్చనినీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
 
దంతాలకు మెరుపు: పళ్ల మీది మచ్చలు తొలగించి, తెల్లగా మెరిసేలా చేస్తుంది. కొద్దిగా ఉప్పు, బేకింగ్‌ సోడాను టూత్‌బ్రష్‌ మీద వేసుకొని తోమితే దంతాల మీది పాచి వదిలి, అవి దానిమ్మ గింజల్లా తళతళలాడుతాయి.
 
బాడీ స్క్రబ్‌: సగం కప్పు ఆలివ్‌ నూనెలో నాలుగోవంతు ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు, భుజాలు, కాళ్లు, పాదాల మీద మసాజ్‌ చేసినట్లు రాసుకోవాలి. దీంతో మృతకణాలు తొలగిపోతాయి.
 
గోళ్ల అందానికి: టీ స్పూన్‌ ఉప్పు, బేకింగ్‌ సోడా, నిమ్మరసాన్ని సగం కప్పు వేడినీళ్లలో కలపాలి. ఇప్పుడు గోళ్లను 10 నుంచి 15 నిమిషాల సేపు ఈ నీళ్లలో ఉంచాలి. తరువాత మృదువైన బ్రష్‌త్‌ గోళ్లను శుభ్రం చేసుకోవాలి. దీంతో వాటిలోని మురికి వదిలి, సున్నితంగా మారడమే కాదు మెరుస్తాయి కూడా.