ఫైబర్‌ కోసం...

26-06-2019: ఫైబర్‌ రక్తంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి పీచుపదార్థాలు (ఫైబర్‌) ఎక్కువగా ఉన్న పదార్థాలు మంచి డైట్‌. పెద్దపేగులో అకస్మికంగా వచ్చే మంట, నొప్పిని ఫైబర్‌ తగ్గిస్తుంది. రోజుకు కనీసం 38గ్రాముల ఫైబర్‌ తినాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఫైబర్‌ ఎక్కువగా
అందాలంటే ఏమేం తినాలంటే...
 
బ్రౌన్‌ రైస్‌: కప్పు సాధారణ రైస్‌లో రెండు గ్రాముల ఫైబర్‌ ఉంటే, కప్పు బ్రౌన్‌ రైస్‌లో 4గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. మధుమేహం ఉన్నవారు బ్రౌన్‌ రైస్‌ తింటే రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి బ్రౌన్‌ రైస్‌ మంచి డైట్‌.
కాబూళీ సెనగలు: శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలతో పాటు మాంగనీస్‌, ఐరన్‌ కూడా వీటిలో ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబూళీ సెనగలు తింటే శరీరానికి కావల్సినంత పీచు అందుతుంది.
తృణ ధాన్యాలు: వీటిలో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. కప్పు తృణ ధాన్యాలు తింటే తొందరగా ఆకలి వేయదు. వీటిలో సెలీనియం, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌తో పాటు విటమిన్‌ బి కూడా ఎక్కువగా ఉంటుంది.
కొబ్బరి: ఓట్స్‌లో కన్నా కొబ్బరిలో 6 పాళ్లు ఫైబర్‌ అదనంగా ఉంటుంది. కొబ్బరి రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది.
బఠాణి: వీటిలో 9గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవగా ఉంటాయి. వీటిని తింటే త్వరగా బరువు తగ్గుతారు.