ఆరోగ్యంగా...ఆనందంగా!

ఆంధ్రజ్యోతి (10-12-2019): ఆరోగ్యంలోనే ఆనందం ఉంటుంది. ఆరోగ్యం పొందడం కోసం ఎంచుకునే మార్గం మెరుగైనది అయితే, రెట్టింపు ఫలితం దక్కుతుంది. ఇందుకోసం ఆయుర్వేద మార్గాన్ని అనుసరించాలి!

 
ప్రతి రోజూ ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తూనే ఉంటాం. వాటికి ఆయుర్వేద పద్ధతులను జోడిస్తే మరింత మెరుగైన, ఫలవంతమైన ఆరోగ్యం దక్కుతుంది. ఇందుకోసం ఈ చిట్కాలు పాటించాలి.
 
ప్రతి రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే, పరగడుపున నిమ్మరసం తాగుతాం. ఇదే నిమ్మరసంలో కొంత పసుపు కూడా కలుపుకొని తాగితే వాపులు, నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం సూచిస్తోంది.
ఉదయం వేళ చేసే వ్యాయామంలో ప్రాణాయామం, యోగా, ధ్యానాలకు తలా పదినిమిషాల సమయం కేటాయిస్తే, రోజు మొత్తం చలాకీగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
 
ఉదయం 7 నుంచి 8 మధ్య అల్పాహారం, మధ్యాహ్నం 12 నుంచి 2 మధ్య మధ్యాహ్న భోజనం, సాయంత్రం 6 నుంచి 7 మధ్య రాత్రి భోజనం ముగించాలి.
 
ఉదయం అల్పాహారం తగుమాత్రంగా, మధ్యాహ్న భోజనం దిట్టంగా, రాత్రి భోజనం తేలికగా తీసుకోవాలనేది ఆయుర్వేద సూచన.
 
వ్యాయామం కోసం ఉదయం 6 నుంచి 10, సాయంత్రం అయితే 5 నుంచి 6 గంటల మధ్య సమయాలు అనువైనవి.