ఉపవాసం అంటే పస్తులు ఉండడమేనా?

మన సంప్రదాయంలో ఉపవాస దీక్షలు చేయడం అనాదిగా ఉన్నదే. అయితే ఆ ఉపవాసాల వెనుక కేవలం భక్తిపరమైన అంశాలే కాకుండా ఆరోగాన్ని పరిరక్షించే లక్ష్యాలు కూడా ఉన్నాయి. ఉపవాసం అంటే ప్రకృతి సహజమైన ఆహారం తీసుకోవాలనే అసలు ఉద్దేశాన్ని ఎవరూ విస్మరించకూడదు అంటున్నారు వైద్య నిపుణులు.
 
‘‘ఉపవాస దీక్ష భక్తి, ఆధ్యాత్మిక విషయాల్లో అంతర్భాగంగా ఉన్నా, దీని వెనుక ఆరోగ్యపరమైన అంశాలు కూడా ఉన్నాయి. సహజంగా సాత్విక భోజనమే శరీరానికి అన్ని వేళలా ఉత్తమం. ఒకవేళ రోజూ సాధ్యం కాకపోతే కనీసం పండగల సందర్భాల్లోనైనా సాత్విక ఆహారం తీసుకునేలా చేయాలనేదే వీటి వెనకున్న సంకల్పం. పండ్లు, కూరగాయలు అతి తక్కువగా తీసుకుంటూ రోజూ అన్నమే తినేవారిలో సహజంగానే విటమిన్లు, లవణాల లోపాలు ఉండే ప్రమాదం ఉంది. అలాంటి వారు రోజు వారీ ఆహార పదార్థాలు మానేసి, కనీసం ఆరోజైనా ప్రకృతి సిద్ధమైన పండ్లను ఆహారంగా తీసుకోవాలనేది ఉద్దేశం. కానీ, చాలా మంది ఏమీ తినకుండా రోజంతా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటారు. ఆరోగ్యానికి ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. భక్తికి కావలసింది సాత్వికతే అయితే అందుకు సాత్విక ఆహారం తీసుకోవాలే గానీ పూర్తి స్థాయిలో పస్తులు ఉండడం కాదు. అయితే ఏడాదికి ఒకటి రెండు సార్లే అయితే ఫరవాలేదు గానీ, వారానికి ఒకసారి లేదా రెండు మూడుసార్లు ఇలా చేస్తే మాత్రం ఆరోగ్యానికి చేటు కలుగుతుంది. ప్రారంభంలో దాని తాలూకు దుష్ఫలితాలు పెద్దగా ఏమీ కనిపించకపోవచ్చు కానీ, ఏళ్ల తరబడి ఇలాగే కొనసాగిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి.
 
అధిక రక్తపోటు, మధుమేహంతో..... 
సాధారణ ఆరోగ్యంతో ఉన్న వారే అయినా వారానికి ఒకసారి పండ్లు, పాలు వంటివేమీ తీసుకోకుండా ఉండిపోతే జీర్ణాశయ సంబంధిత సమస్యలెన్నో తలెత్తుతాయి. పేగుల చలన శక్తి తగ్గిపోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో పాటు తీవ్రమైన మలబద్ధకం కూడా మొదలవుతుంది. ఆరోగ్యవంతుల్లోనే ఈ సమస్యలు ఉంటే అప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఉపవాసం వల్ల పలు విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి. రక్తపోటు, షుగర్‌ నిలవల్లో అస్తవ్యస్తత ఏర్పడి ఒక దశలో వాటిని నియంత్రించడానికి ఎక్కువ మోతాదులో మాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అప్పటికే కిడ్నీ సమస్యలు ఉంటే ఉపవాసం ఒక్కోసారి ప్రమాద స్థితికి చేర్చవచ్చు. ఉపవాసంతో ఉన్న రోజున కొందరు నీళ్లు కూడా తాగరు ఇది మరీ ప్రమాదం. శరీరంలోని మలినాల్ని ఎప్పటికప్పుడు బయటికి పంపేది నీరే. ఆ నీరే అందకపోతే శరీరంలోని మలినాలు మూత్రం ద్వారా బయటికి వెళ్లే అవ కాశమే ఉండదు. దీని వల్ల మూత్రకోశంలో ఇన్‌ఫెక్షన్లు చోటుచేసుకునే స్థితి ఏర్పడుతుంది.
 
బి-12 లోపాలతో చిక్కే.... 
ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు పాలుకూడా తీసుకోకపోతే శరీరంలో బి-12 లోపం ఏర్పడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గిపోతుంది. ఈ స్థితిలో మెగలోబ్లాస్టిక్‌ అనీమియా అనే రక్తహీనత సమస్య మొదలవుతుంది. దీర్ఘకాలికంగా ఉండే రక్తహీనత సమస్య వల్ల నరాల వ్యవస్థ దెబ్బ తింటుంది. దీనివల్ల నాడీవ్యవస్థ సంబంధితమైన పలు వ్యాఽధులు రావచ్చు. వీటితో పాటు చర్మం కాంతిహీనమై, విపరీతంగా ముడతలు ఏర్పడి అకాల వృద్ధాప్యం రావచ్చు. అంతకు ముందే లివర్‌, కిడ్నీ, గుండె జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితిలో ఉపవాసం చేయకూడదు. ఒక్క పొద్దు అన్న పేరుతో ఉండే ఒక పూట ఉపవాసం ఫరవాలేదు గానీ రోజంతా ఉపవాసం ఉండడం ఎంత మాత్రం క్షేమం కాదు.
 
పండ్లు ప్రత్యామ్నాయం 
ఉపవాసం రోజున ఆహారానికి ప్రత్యామ్నాయంగా పండ్లను తీసుకోవాలి. ఒక వేళ మధుమేహం ఉంటే ఏవైనా సూప్స్‌ అంటే కూరగాయల రసాల వంటివి తాగొచ్చు. అలా తీసుకోవడం వల్ల వారమంతా తీసుకున్న మసాలా పదార్థాల తాలూకు వ్యర్థాలు శరీరంలోంచి తొలగిపోతాయి. దీనివల్ల శరీర వ్యవస్థను సహజ సిద్ధంగా శుద్ధి చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. భక్తి, సంప్రదాయాల పేరుతోనో పలు రకాల నియమాలు ఉంటాయి. అయితే మౌలికంగా వాటి వెనక ఆరోగ్య పరమైన లక్ష్యాలే ఉన్నాయి. అసలు ఆ విషయాన్ని విస్మరించి శరీరాన్ని శుష్కింప చేస్తే దాని వల్ల కలిగే నష్టాలకు మీరే బాధ్యులవుతారు’’ అంటున్నారు కేర్‌ హాస్పిటల్‌లోని గ్యాసో్ట్రఎంటరాలజిస్టు డాక్టర్‌ పి.బి.ఎస్‌.ఎస్‌ రాజు. అందుకే కార్బోహైడ్రేట్లు విరివిగా ఉండే ధాన్యపు ఆహారాన్ని మానేసినా, వాటి స్థానంలో ప్రకృతి సహజమైన ఆహారంతో పూరించాలి. ఈ విధానంలో శరీరమూ, మనసూ తేలికపడతాయి. భక్తి, ఆధ్యాత్మిక లక్ష్యాలకు కూడా ఆ స్థితే కదా కావాలి.