14-06-2019: బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్, డిన్నర్.. ఇలా భోజనంలో ఎప్పుడైనా తినదగ్గ సూపర్‌ఫుడ్ గుడ్డు. రోజుకో గుడ్డు తింటే శరీరం, మెదడు చురుగ్గా ఉంటాయి. ఒంటికి శక్తినీ, ఆరోగ్యాన్నీ అందించే గుడ్డులో చాలా ప్రత్యేకతలున్నాయి. అవేమిటంటే...
గుడ్డులో డి, ఇ, కె, బి6 విటమిన్లతో పాటు ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. కార్భోహైడ్రేట్స్, చక్కెరలు, గ్లుటెన్ ఉండవు. దాంతో ఎగ్స్ పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఛాయిస్.
దీనిలోని విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
గుడ్డు పచ్చసొనలోవిటమిన్ డి లభిస్తుంది. రోజు గుడ్డు తింటే ఎముకలు ఆరోగ్యంగా, బలంగా తయారవుతాయి. రికెట్స్, ఆస్టియోపోరోసిస్ ముప్పు తప్పుతుంది.
ఎగ్లో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పటికీ, అది రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలను ఏమాత్రం పెంచదు. అంతేకాదు దీనిలో హెచ్‌డిఎల్, మంచి కొవ్వు ఉంటుంది.
వీటిలోని కొలిన్ అనే పోషకం గుండె జబ్బులకు కారణమయ్యే హోమోసిస్టీన్ అమైనో ఆమ్లాన్ని విడగొడుతుంది. దాంతో గుండెను ఆరోగ్యంగా ఉంచి, గుండెపోటు ప్రమాదాన్ని అడ్డుకుంటుంది.
గర్భిణులు, బాలింతలు రోజూ గుడ్డు తింటే పిల్లల మెదడు వికాసానికి అవసరమైన కొలిన్ లభిస్తుంది.
గుడ్డులో ప్రొటీన్లు మెండుగా ఉంటాయి. దీంతో తొందరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు గుడ్డును ఢైట్లో చేర్చుకుంటే మంచిది.