ఇలాగైతే ఇట్టే జీర్ణం!

28-10-2019: రుచి నాలుక మీద ఉన్నంత వరకే! అందుకే ‘జిహ్వచాపల్యం’ అన్నారు! అయినా వంటకాల ఘుమఘుమలు ముక్కుకు సోకితే ఆగగలమా? చటుక్కున అందుకుని లటుక్కున గుటకాయస్వాహా చేసేస్తాం. పండగ రోజుల్లోనైతే నోరూరించే పిండివంటలు ఎంచక్కా లాగించేస్తాం. ఫలితం.... అజీర్తి, ఛాతిలో మంట, పొట్టలో నొప్పి! పండగ తర్వాత కూడా ఈ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి! ఈ సమస్యలకు చరమగీతం పాడాలంటే?
 
పిండిపదార్థాలు, మాంసకృత్తులు, పీచు... ఇలా పోషకాలన్నీ సమపాళ్లలో ఉన్న సమతులాహారం తీసుకుంటే జీర్ణవ్యవస్థ సమర్థంగా తన పని తాను చేసుకుపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో, మరీ ముఖ్యంగా పండగ రోజుల్లో చక్కెర, పిండిపదార్థాలు, కొవ్వులను పిండివంటల రూపంలో, ఎక్కువ పరిమాణాల్లో తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిని అరిగించుకోవాలంటే జీర్ణవ్యవస్థకు సరిపడా సమయం ఇవ్వాలి. కానీ మామూలుగా తినే భోజనంతో పాటు స్వీట్ల పేరుతో పిండి వంటకాలను కూడా తినేయడంతో అరుగుదల సమస్యలు మొదలవుతాయి.
ఆ సమయంలో కనిపించే లక్షణాలు....
కడుపు ఉబ్బరం
పొట్టలో నొప్పి
తేన్పులు
అజీర్తి
జిగట విరేచనాలు
 
తీపి ప్రభావం!
తీపి అందరికీ ఆరోగ్యకరం కాదు. మరీ ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారిలో అవసరానికి మించి తోడయ్యే అధిక చక్కెరలను శరీరం శక్తిగా మలుచుకోలేదు. పైగా చక్కెర స్థాయులు పెరిగేకొద్దీ వీరిలో ఆందోళన, చికాకు లాంటి మానసిక అసమతౌల్యాలు మొదలవుతాయి. ఆహారం అరుగుదలలో కాలేయం పాత్ర ప్రధానం. పిండి వంటకాల్లోని అధిక చక్కెరలను శక్తిగా మార్చుకోవడంలో కాలేయం విఫలమవడంతో, అవి కొవ్వు రూపంలో కాలేయంలోనే నిల్వ ఉండిపోతాయి. ఇది ప్రమాదకరం. మధుమేహులు తీపి తినేసి, షుగర్‌ మాత్ర మరొకటి వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇది సరి కాదు. తక్కువ చక్కెరతో తయారైన తీపి పదార్థాలను అరుదుగా కొద్ది పరిమాణాల్లో తీసుకుంటే ఫరవాలేదు. అయితే ఈ విషయాన్ని ముందుగానే వైద్యులకు చెప్పి, తీసుకునే మందుల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో అడిగి తెలుసుకోవాలి.
 
కాలేయం, జీర్ణాశయం మీద ఒత్తిడి!
పండగ రోజుల్లో చేసే ప్రధాన వంటకాలు అరిసెలు, కజ్జికాయలు, బాదుషా లాంటివన్నీ నూనెలో వేగించేవే! వీటిలో తీపితో పాటు నూనె పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటికి తోడు గారెలు, బూరెలు, బొబ్బట్లు... వీటి తయారీలో నెయ్యి వాడతారు. ఈ పిండివంటలన్నీ అధిక కొవ్వులు, చక్కెర, పిండిపదార్థాలతో నిండి ఉంటాయి. నూనెలను అరిగించడానికి కాలేయం నుంచి జీర్ణరసాలు అధికంగా విడుదల కావలసి ఉంటుంది. అధిక నూనెలతో కూడిన పిండివంటకాలు తిన్నప్పుడు కాలేయం, జీర్ణాశయాల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో మధ్యవయస్కులు, 50 ఏళ్లు పైబడిన వారిలో అజీర్తి సమస్యలు మొదలవుతాయి.
 
వృద్ధులు పిండివంటలు మితంగా తినాలి!
సెనగపిండి, మినప్పిండి, బియ్యం పిండి లాంటివి పూర్తిస్థాయి పిండిపదార్థాలే! వీటిలో అదనపు పోషకాలు ఉండవు. వీటిని జీర్ణం చేసుకోగలిగే శక్తి, జీర్ణం కావడానికి అవసరమైన జీర్ణరసాలు వృద్ధుల్లో ఉత్పత్తి కావు. కాబట్టి వృద్ధులు పిండివంటలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. వీరిలో చక్కెర స్థాయులు కూడా ఉన్నపళాన హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. దాంతో తలనొప్పి, తల తిరుగుడు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి మధుమేహులు తీపి పదార్థాలకు దూరంగా ఉండడమే మేలు. వృద్ధుల్లో ఆహారనాళం, జీర్ణాశయం కలిసే జంక్షన్‌ బలహీనంగా ఉంటుంది. దాంతో పరిమితికి మించి తింటే, యాసిడ్లు గొంతులోకి ఎగదన్నుతాయి. దాంతో ఛాతిలో మంట, ఛాతి పట్టేయడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి వేళ నిద్రాభంగం కలుగుతూ ఉంటుంది.
 
పిల్లలు ఏం తింటున్నారో గమనించాలి!
ఓ పక్క అమ్మలు పిండివంటలు చేస్తుంటే, మరోపక్క వండినవి వండినట్టు పిల్లలు తినేస్తూ ఉంటారు. పండగ సెలవులు కాబట్టి పిల్లలకు తెలియకుండా, చాటుగా పిండివంటలు వండడం వీలయ్యే పని కాదు. పైగా వాళ్లు ఇష్టంగా అందుకుని తింటూ ఉంటే, పెద్దలూ వారించలేరు. దాంతో పిల్లలు రోజంతా వాటితోనే కడుపు నింపుకొంటూ భోజనం మానేస్తూ ఉంటారు. పిండివంటల్లో ప్రధానంగా ఉండేవి పిండిపదార్థాలు, చక్కెరలే! మాంసకృత్తులు, పీచు వీటిలో అతి తక్కువ. దాంతో పిల్లల్లో పోషకాహారలోపం తలెత్తుతుంది. అజీర్తి సమస్యలూ మొదలవుతాయి. కాబట్టి పిల్లలను కొంత కట్టడి చేయక తప్పదు. భోజనం చేస్తేనే స్వీటు ఇస్తానంటూ కండిషన్లు పెట్టి, పిల్లల చేత ఆహారం తినిపించాలి. పిండివంటకాలతో పాటు తాజాపండ్లు, సలాడ్లు కూడా తినేలా ప్రోత్సహిస్తే మలబద్ధకం లాంటి సమస్యలు తలెత్తవు. అలాగే నీళ్లు సరిపడా తాగేలా చూడాలి.
 
అజీర్తి చేయకుండా ..
అజీర్తి సమస్యలు తలెత్తకుండా పండగనాటి పిండివంటలను ఆస్వాదించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....
భోజనం తర్వాత మాత్రమే మితంగా ఒకటి లేదా రెండు పిండివంటలు ఆస్వాదించాలి.
ఏం తిన్నా, ఎప్పుడు తిన్నా పరిమితంగా తినాలి.
రుచికరంగా ఉన్నాయి కదా అని ఒకేసారి అన్ని వంటకాలు రుచి చూస్తూ, భారీగా భోజనం చేయకూడదు.
రోజుకు మూడు పూటలా కడుపు నిండా తినడం కన్నా, అదే ఆహార పరిమాణాన్ని 6 విడతల్లో తక్కువ పరిమాణాల్లో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.