నీళ్లు తాగుతున్నారా?

ఆంధ్రజ్యోతి: చాలామంది నీళ్లు తక్కువ తాగుతుంటారు. దీనివల్ల వీరికి రకరకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. నీళ్లు బాగా తాగడం వల్ల కేన్సర్‌లాంటి జబ్బులపై పోరాటం చేయొచ్చు. చర్మాన్ని పట్టులా మృదువుగా ఉంచుకోవచ్చు. ఇవే కాదు మరెన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మన శరీర ఆరోగ్యంపై నీరు సంజీవనిలా పనిచేస్తుంది. అవేమిటో తెలుసుకుందామా...

శరీర బరువు 
నీళ్లు బాగా తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అందులోనూ గోరువెచ్చటి నీళ్లు తాగితే మరీ మంచిది. అన్నం తినడానికి ముందు ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫ్యాట్‌ వల్ల శరీరంలో చేరే ఇతర పదార్థాలను సైతం నీరు బయటకు పంపేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల డీ-హైడ్రేషన్‌ సమస్య తలెత్తదు. అంతేకాదు శరీరంలోని విషపదార్థాలు బయటకుపోతాయి.
 
కేన్సర్‌పై పోరాడుతుంది
శరీరంలో కేన్సర్‌ కారక ఏజెంట్లు కేంద్రీకృతం కాకుండా నీరు సహాయపడుతుంది. రోజూ ఐదు గ్లాసుల నీరు తాగడం వల్ల పెద్దపేగు కేన్సర్‌ వచ్చే అవకాశాలు దాదాపు 45 శాతం వరకూ తగ్గితే, రొమ్ము కేన్సర్‌ వచ్చే అవకాశాలు 79శాతం తగ్గుతాయి. అంతేకాదు మూత్రాశయకేన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా 50 శాతం తగ్గుతాయి. 
 
మృదువైన చర్మం కోసం 
నీరు అతి చౌకైన యాంటి ఏజింగ్‌ సాధనం. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల చర్మం మెరవడమే కాదు ముడతలు పడదు. వయసు తెలియదు. చర్మంలోని టాక్సిన్స్‌ బయటకు పోతాయి. అంతేకాదు యాక్నేలాంటివి రావు. స్కిన్‌ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నీరు బాగా తాగడం వల్ల యంగ్‌గా కూడా కనిపిస్తారు.
 
ఆరోగ్యమైన శిరోజాలు 
తాగే నీరు కూడా శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చల్లటి నీళ్లతో తల స్నానం చేయడం వల్ల వెంట్రుకలు మెరుస్తూ సిల్కులా జారిపోతుంటాయి. చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకల్లో ఎక్కువ మురికి చేరదు. ఫలితంగా వెంట్రుకలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఉప్పునీళ్లు, క్లోరినేటెడ్‌ నీళ్లతో తలస్నానం చేయొద్దు. వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి.
 
ఒళ్లు నొప్పులు తగ్గడానికి 
తలనొప్పి, వెన్నునొప్పులతో బాధపడేవాళ్లు నీటిని బాగా తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తీవ్రత బాగా తగ్గుతుంది. కండరాలు కూడా బలంగా తయారవుతాయి. శరీరంలోని కణాలకు నీటి ద్వారా తగినంత ఆక్సిజన్‌ అందడం వల్ల కండరాలు పటిష్టంగా ఉంటాయి. ఎక్కువసేపు పనిచేసినా కండరాల నొప్పులుండవు. నీరు బాగా తాగడం వల్ల కీళ్లకు కావాల్సినంత మాయిశ్చరైజర్‌ అందుతుంది కాబట్టి జాయింట్లు బలిష్టంగా , ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి.
 
రోగనిరోధకశక్తికి 
నీరు బాగా తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువవుతుంది. ఫ్లూ వంటి వాటిని తట్టుకుని ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. నిమరసం కలిసిన నీళ్లను తాగడం వల్ల శ్వాసకోశ సంబంధమైన జబ్బులు, చిన్నప్రేగులో సమస్యలు తలెత్తవు. అంతేకాదు రుమటిజం, ఆర్థరైటిస్‌ వంటివి రావు. 

బాగా తాగితే... 
స్నానం చేసే ముందర ఒక గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది 
నిద్రపోయేముందు గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల సో్ట్రక్‌గాని, గుండెపోటుగాని రాదు 
రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి 
నీళ్లు తక్కువ తాగితే జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. కంప్యూటర్‌ స్ర్కీన్‌ని కూడా సరిగా చూడలేరు 
 వాకింగ్‌ చేసిన తర్వాత రెండు గ్లాసుల మంచినీళ్లు తాగితే శరీర భాగాల్లో కదలిక వస్తుంది 
 అన్నం తినడానికి అరగంట ముందు ఒక గ్లాసుడు మంచినీళ్లు తాగితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. నీటిని ఎక్కువ తాగితే మలబద్దకం సమస్యను నియంత్రించవచ్చు.