ఆల్‌ బుఖారాతో అంతా మంచే..

29-06-2019: గుండ్రంగా, ఎరుపు రంగులో ఎక్కువ గుజ్జుతో ఉండే ఆల్‌ బుఖారా తీయగా, పుల్లగా, వగరుగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఈ పండు శరీర బరువును నియంత్రించడంలో, మధుమేహం నుంచి గట్టెక్కించడంలో సాయపడుతుంది. దీన్ని డ్రై ఫ్రూట్‌గా లేదా ఫ్రూట్‌ సలాడ్‌గా తినొచ్చు.

వీటిలో కొవ్వు తక్కువగా, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఎ, సి,డి, బి6, బి 12 విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్షీషియం, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి.
వీటిలో పీచు ఎక్కువ. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరానికి మందుగానూ పనిచేస్తుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను పారదోలి రొమ్ము, గొంతు కేన్సర్ల బారి నుంచి రక్షిస్తాయి.
దీనిలోని విటమిన్లు, ముఖ్యంగా విటమిన్‌ ఎ, కంటి చూపును పెంచుతుంది. విటమిన్‌ సి చిగుళ్లు, దంతాలను ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ పండులోని విటమిన్లు, పోషకాలు ఎముకల్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మోనోపాజ్‌ దశ దాటిన మహిళలు ఆల్‌ బుఖారా తింటే ఎముకల సాంద్రతను పెంచేందుకు అవసరమైన విటమిన్‌ కె, ప్లావనాయిడ్స్‌, ఫినోలిక్స్‌ లభిస్తాయి.
ఈ పండులోని ఐరన్‌ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. అంతేకాదు రక్తహీనతను నివారించి రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు దోహదపడుతుంది.
ఆల్‌ బుఖారాలోని యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం గర్భిణులకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. వారి అలసటను దూరం చేస్తాయి కూడా.
వీటిలో పీచు అధికంగా, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది. ఆల్‌ బుఖారా రక్తంతో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. టైప్‌-2 డయాబెటీస్‌ ముప్పు నుంచి కాపాడుతుంది. ఇన్సులిన్‌ నిల్వల్ని నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటీ్‌సతో బాధపడేవారికి ఈ పండు మంచి ఫుడ్‌.