ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

ఆంధ్రజ్యోతి (16-01-2020):మనకంటే మన పూర్వీకులు చాలా ముందుచూపుతో ఉండేవాళ్లు. ఆ విషయం వాళ్లు ప్రతిదాంట్లోనూ నిరూపించుకున్నారు. ఇప్పటికీ నిరూపించుకుంటూనే ఉన్నారు. శారీరకంగా, మానసికంగా, టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు పూర్వీకులు. మనమూ, మన ముందుతరాలు పాటించదగిన ఎన్నో పద్ధతులు బోధించారు. వాటి గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే... పూర్వపు ఆలోచనలు వట్టి పనికిరానివేమీ కాదు. వాటి వెనక చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పూర్వీకులు పడిన కష‌్టం, చేసిన పనులు, ఉపయోగించిన వస్తువులు అన్నీ ప్రయోజనకరమైనవే. వారు రాగి పాత్రలు వాడినా, కట్టెపొయ్యిలు ఉపయోగించినా వాటన్నింటిలో మనకు ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ ఆలోచనలన్నీ మళ్లీ పురుడుపోసుకుంటున్నాయి. 

కొన్ని రెస్టారెంట్స్‌లో రాగి పాత్రలలోనే సర్వింగ్ చేస్తూ పాత ట్రెండ్‌ని మళ్లీ పరిచయం చేస్తున్నారు. ఏది ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మరోసారి ప్రూవ్ చేస్తున్నారు. ఒకప్పటి ఆరోగ్య సూత్రాలే ఇప్పటి తరాలకు అవసరమవుతున్నాయి. ఇప్పుడున్న కాలుష్యం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు అప్పటి పద్ధతులు, చిట్కాలు అనుసరించడం ద్వారానే పరిష్కారాలు లభిస్తున్నాయి. చిన్న వయసులో వచ్చే అనారోగ్య సమస్యలు, తెల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే రాగి పాత్రలే సరైన పరిష్కారం అంటున్నారు నిపుణులు. రాగి వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలపై చిన్నకథనం..

అంత ప్రాధాన్యం ఎందుకు?

ఆరోగ్యంగా ఉండడానికి, శుభ్రంగా జీవించడానికి మన సంప్రదాయాల్లోని కొన్ని విషయాలు చాలా దోహదం చేస్తాయి. అటువంటిదే రాగి పాత్రల వాడకం. ఇంట్లో పూజా పునస్కారాలకు మనం రాగి, వెండి పాత్రలు వాడడం కద్దు. ఈ లోహాలకున్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలే వాటిని పూజార్హనీయం చేశాయి. అంతేకాదు ఒక్కసారి తాతముత్తాతల కాలంలోకి తొంగి చూస్తే, రాగి బిందెలు, ఇత్తడి గిన్నెలు, కంచు పాత్రలను, వాటితో చేసిన విలువైన, అరుదైన సామగ్రినీ మనం చూడొచ్చు. ఆనాడు అవసరాలకోసం ఉపయోగించిన ప్రతిలోహంలోనూ రాగిని మిశ్రమంగా ఉపయోగించారు.  ‘‘ఈ రాగిలోహానికి ఆనాడు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారు? మన జీవితంలో ఒక భాగమైపోయేంతగా ఉపయోగించడం వెనుక ఈ లోహానికున్న ప్రత్యేక లక్షణాలేమిటి?’’ అని ఆధునిక పరిశోధకులు తరచి చూస్తే,  ఆ లోహానికి సంబంధించిన బోలెడన్ని విషయాలు బయటపడ్డాయి.  అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ సంస్థ చేసిన పరిశోధనల్లో పలు విషయాలు వెలుగు చూ‍శాయి. రాగిని శరీరానికి అవసరమైన ‘ట్రేస్‌ ఎలిమెంట్‌’గా పూర్వీకులు గుర్తించారు. అంతేకాదు, రాగి వాడకం లోపిస్తే లేదా వాడకం ఎక్కువ అయితే కలిగే లాభనష్టాలేమిటో కూడా తెలుసుకోవడంవల్ల ఈ సంస్థ చేసిన పరిశోధనలకు గుర్తింపు లభించింది.

ద్వాదశ ప్రయోజనాలు

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో రాగి వాడకం వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యమైన 12 గుణాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, 1. ఎసిడిటీని తగ్గించడం 2. అల్సర్లతోపాటు అజీర్ణాన్ని అరికట్టడం 3. అధిక బరువు తగ్గించడం 4. గుండెజబ్బును నివారించడం 5. కేన్సర్‌ నిరోధక సామర్థ్యం 6. డయేరియా దరి చేరకుండా చేయడం 7. కామెర్లు రాకుండా చూడడం 8. థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేయనీయకుండా చేయడం 9. థైరాయిడ్‌ గ్రంథి పనితీరు క్షీణించకుండా చూడటం, 10. ఆర్థరైటిస్‌ రాకుండా కీళ్లను బలంగా ఉంచడం 11. రక్తహీనతను నివారించడం 12. రెండు రకాల రక్తపోట్లను దూరంగా ఉంచడం.

రాగితో చేసిన పైపు లైన్లు 

రాగి పాత్రలలను వంటింట్లో ఎక్కువగా వాడటం వెనక అమోఘమైన ప్రయోజనాలు ఎన్నో కనిపిస్తున్నాయి. రాగి పాత్రలు వైరస్‌ను, బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. రాగి చెంబులో నీళ్ళు తాగితే మంచిదని ఆయుర్వేదం కూడా చెబుతోంది. అయితే పురాతన ఈజిఫ్టియన్లు రాగిపాత్రలలో నీటిని నిల్వ ఉంచడంవల్ల అవి ఎంతో తాజాగా ఉంటాయని నమ్మేవాళ్లు. సైన్స్ ప్రకారం రాగి పాత్రలు ఫుడ్ పాయిజినింగ్‌కి కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని తెలుస్తోంది. అమెరికాలోని పురాతన ఇళ్లలో ఇప్పటికీ పైపు లైన్లు రాగితో చేసినవే ఉన్నాయి. మన శరీరానికి కాపర్ చాలా అవసరం. దాన్ని కొన్ని ఆహార పదార్థాలైన బీన్స్, ఆకుకూరలు, కూరగాయలు, తేనెల ద్వారా కూడా మన శరీరం రాగిని సమకూర్చుకుంటుంది. 

నీటిని సహజశుద్ధి చేసే గుణం 

రాగి పాత్రల్లో నీరు సహజంగానే శుద్ధి అవుతుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తామర జలం అంటారు. వాటిలోని సూక్ష్మజీవులు నాశనం అవుతాయి. రాగి చెంబులో నీటిని రాత్రంతా నిల్వ ఉంచి ఉదయాన్నే ఆ నీరు తాగడంవల్ల వాత, పిత్త, కఫ దోష నివారణ జరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. శరీరంలోని వివిధ అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. రాగి పాత్రల్లోని నీరు కడుపులో మంట తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థలో ఏర్పడే అల్సర్లు తగ్గడానికి, వాటి పనితీరు మెరుగవడానికి సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలు శరీరానికి అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ప్రయోజనకరం. రూం టెంపరేచర్‌లో రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉంచిన ఒక గ్లాసు నీరు తాగడంవల్ల కిడ్నీల్లో ఉండే మలినాలు తొలగిపోయి.. జీర్ణాశయాంతర నాళాన్ని శుభ్రం చేస్తాయి. అంతేకాదు జీర్ణ ప్రక్రియ ఆరోగ్యంగా ఉండటానికి, ఒబేసిటీని తగ్గించి ఫ్యాట్‌ని కరిగించడానికి సహకరిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచిన రెండు లీటర్ల నీటిని సేవించడం ద్వారా 40 శాతం కాపర్ పొందగలుగుతాం. రాగి పాత్రలో ఉంచిన నీటిని కనీసం ఎనిమిది గంటల తర్వాత తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.

నదుల్లో రాగి నాణేలు పడేయడం వెనుక ఆంతర్యం ?

 ప్రాచీన భారతీయులకు, రాగి నాణేలను నదులు, బావులలో వేయడం ఆనవాయితీగా ఉండేది. దాని వెనకున్న ఆంతర్యం తెలియక ఈ తరం వాళ్లు అల్యూమినియం నాణేలని నదులలో వేస్తూ.. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నారు. అయితే పూర్వీకులు రాగి నాణేలను ఎందుకు వేసేవాళ్లంటే.. అది నీటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని. అంతేకాదు చేపలకు శుభ్రమైన నీళ్లు అందుతాయని భావించేవాళ్లు. ఇది శరీరానికి అందడంవల్ల చాలా ప్రయోజనాలున్నాయి. కాలేయం, గుండె, కిడ్నీ, కండరాల ఆరోగ్యానికి ఇది అవసరం. శరీరంలో శక్తిని మెరుగుపరచడానికి కూడా కాపర్ చాలా అవసరం. కాపర్ యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. కాబట్టి రాగితో చేసిన గొళ్ళాలు తలుపులకు పెడితే, ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది.

ఆరోగ్యానికే  కాదు..అందానికీ. ....

ఆరోగ్యానికే కాదు శారీరకమైన అందానికీ రాగివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిఫుణులు. వయసు పైబడడంవల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా రాగి దోహదం చేస్తుంది. చర్మంపై ముడతల నివారణకు రాగి సహజంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, సెల్ ఫార్మేషన్, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే గుణం రాగిలో ఉంటుంది. కాబట్టి రాగి పాత్రలు వాడితే చర్మం ఆరోగ్యంగా, నిగారిస్తూ ఉంటుంది. ప్రస్తుతం టీనేజర్ల నుంచి అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. దీనికీ రాగి మంచి ఔషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. రాగి పాత్రలలో తినడం అలవాటు చేసుకుంటే తెల్ల జుట్టుని నివారించవచ్చు. పిగ్మెంటేషన్ నుంచి బయటపడటానికి కాపర్ మంచి సొల్యూషన్. ఇది చర్మం, జుట్టు, కళ్ళలో వచ్చే పిగ్మెంటేషన్ సమస్యలకు సహజంగా పనిచేస్తుంది. 

ఎన్నో సమస్యలను నియంత్రిస్తుంది

జాయింట్ పెయిన్స్, ఇతర నొప్పులను నివారించడానికి కాపర్ యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. ఎముకల బలానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి కాపర్ సహకరిస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల వ్యాధి చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో కాపర్ మంచి పరిష్కారం. ఎముకల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఇది సహకరిస్తుంది.  థైరాయిడ్ గ్రంథులు క్రమబద్ధంగా పనిచేయడానికి కాపర్ కీలక పాత్ర పోషిస్తుంది. రాగికి నొప్పి, మంట తగ్గించే గుణాలున్నాయి. ఆ కారణంగా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.  ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడానికి కాపర్ బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో బాగా సహకరిస్తుంది కాపర్. అనీమియాను నివారించడంలోనూ కాపర్‌కు సాటి లేదు. రాగి పాత్రల్లోని నీరు తాగడం వలన రక్తహీనత అదుపులో ఉంటుంది. అంతేకాదు వేగంగా గాయాలు తగ్గించగలిగే యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కాపర్ లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి గాయాలకైనా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.రాగి పాత్రలకు త్వరగా మరకలు పడతాయి. అవి ఎన్ని రోజులైనా వదలవు. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం, చింతపండుతో రుద్ది కొన్ని నిమిషాలు అలా వదిలేసి తర్వాత క్లీన్ చేయడంవల్ల మరకలు వదులుతాయి.

 ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటాంగానీ, పాటించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తాం. పూర్వపు పద్ధతులు చాలా ఆరోగ్యకరమైనవి. పూర్వీకులు అనుసరించిన పద్ధతుల వెనక చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి రాగిపాత్రలు వాడటం అంటే ఈ జనరేషన్‌కి కాస్త కష్టమే అయినా వాటివల్ల కలిగే ప్రయోజనాల దృష్టా ఇప్పటినుంచైనా రాగి పాత్రలు ఉపయోగించడం అలవాటు చేసుకోవడమే మంచిదంటున్నారు నిఫుణులు.
 
ఎక్కువైనా ఇబ్బందే సుమా!
24 గంటలూ రాగి పాత్రల్లోని నీరు తాగడం కూడా మంచిదికాదంటున్నారు నిపుణులు. రోజుకు రెండుమూడు సార్లు, ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఎక్కువ మోతాదులో రాగి పాత్రలోని నీళ్లు తాగితే చాలన్నది వారి మాట.  మరీ ఎక్కువ రాగిని శరీరంలోకి తీసుకున్నా ఈ పరిమాణం ఎక్కువై మిగిలిన లోహాలను స్వీకరించడంలో శరీరానికి ఇబ్బంది కలిగి సమస్యలు వస్తాయంటున్నారు. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ అంచనాల ప్రకారం.. రోజుకు 12 మిల్లీగ్రాముల రాగి మన శరీరానికి సరిపోతుంది. మన ఆయుర్వేద అంచనాల ప్రకారం కొద్దిగా ఎక్కువైనా ఫర్వాలేదు. అందుకే, ఇంట్లో అన్నీ రాగి పాత్రలే వాడకుండా, ఇత్తడి పాత్రలు కూడా ఎక్కువగా వాడడం వలన పరిమితమైన మోతాదులో మాత్రమే రాగిని తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణుల సలహా.
–ప్రవళిక వేముల