వేళకు మందులు వేసుకోమనే యాప్‌

ఆంధ్రజ్యోతి, 01-04-2015: వాడివేడిగా మీటింగ్‌ జరుగుతోంది. కాన్ఫరెన్స్‌హాల్‌లో హాట్‌ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. అంతా హర్రీబర్రీ. ఎగ్జిక్యుటివ్‌ శశిధర్‌కు బీప్‌ బీప్‌ మంటూ వచ్చింది మెసేజ్‌ అలర్ట్‌. ‘‘టైమ్‌ అయ్యింది. మీరు మందులు వేసుకోండి’’ అన్నది దాని సారాంశం. టాబ్లెట్‌ తీసి వేసుకుని.. గ్లాసుడు మంచినీళ్లు తాగి.. హమ్మయ్యా అనుకున్నాడు. మందులు వేసుకోమని గుర్తుచేసే యాప్‌ను ఈ మధ్యనే డౌన్‌లోడ్‌ చేసుకున్నాడతను..
 
ఉదయం మొదలు సాయంత్రం వరకు బిజీ బిజీ. ఇంత హడావిడిలో మన ఆరోగ్యం గురించి ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నిత్యం మన చేతుల్లో ఉండే మొబైల్‌కు ఆ బాధ్యతను అప్పగిస్తే ఎంచక్కా అలర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ ఫ్లాట్‌పాం మొబైల్స్‌లో ఈ కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హెల్త్‌సేవర్జ్‌ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఆ యాప్‌ పేరు MyHealthSaverz'
 
యాప్‌ ఉచితం.గూగుల్‌ ప్లేలోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు కాని ఫోన్లకు కూడా ఎస్‌ఎంఎస్‌ సదుపాయం కల్పించారు. ఈ సంస్థలో రిజిసే్ట్రషన్‌ చేయించుకుంటే.. మనం మందులు వేసుకునే టైమ్‌ను ఎస్‌ఎంఎస్‌ ద్వారా సూచిస్తుంది. యాప్‌ కూడా ఇదే పని చేసిపెడుతుంది. హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమాచారం అందిస్తుంది. త్వరలోనే మరో పది భాషల్లో ఈ సదుపాయం కల్పించనుంది కంపెనీ. ‘‘మొబైల్‌ టెక్నాలజీ సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా నాణ్యమైన వైద్య సేవల్ని అందించేందుకు కృషి జరగాలి. అందులో భాగంగానే ఈ యాప్‌ను విడుదల చేశాము’’ అంటున్నారు సంస్థ యజమానులు. ఒక అధ్యయనం ప్రకారం సగం మంది పేషెంట్లు సకాలంలో మందులు వేసుకోవడం లేదని తేలింది. దీన్ని సరిదిద్దేందుకు మొబైల్‌ టెక్నాలజీ సహాయపడుతుందన్నది సంస్థ నిర్వాహకుల ఉద్దేశ్యం. ప్రపంచంలోనే మొబైల్‌ఫోన్ల వాడకంలో రెండో అతి పెద్ద దేశం మనది. భవిష్యత్తులో ఇటువంటి సాంకేతిక సేవలు ఇంకెన్నో అందుబాటులోకి రానున్నాయి.