సూపర్‌బగ్స్‌ నిర్మూలనలో రెండో తరం యాంటీబయాటిక్‌

ఆంధ్రజ్యోతి, 01-06-2015: యాంటీబయాటిక్‌ల విచ్చలవిడి వాడకం వల్ల బ్యాక్టీరియాలో నిరోధకత పెరిగిపోతోందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా బ్యాక్టీరియా (సూపర్‌బగ్స్‌) నిర్మూలనకు రెండోతరం యాంటీబయాటిక్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాజా ఆవిష్కరణతో సూపర్‌బగ్స్‌ను సమూలంగా తుడిచిపెట్టవచ్చని సెయింట్‌ జూడె పిల్లల పరిశోధక ఆస్పత్రి నిపుణులు తెలిపారు. 1960 లలో ఆవిష్కరించిన స్పెక్టినోమైసిన్‌ అనే యాంటీబయాటిక్‌ రసాయనిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా ఈ రెండో తరం యాంటీ బయాటిక్‌ను అభివృద్ధి చేశామని వివరించారు. దీంతో ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో.. ఎలుకలకు న్యూమోకోకల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా తాజా యాంటీ బయాటిక్‌ విజయవంతంగా అడ్డుకుంటోందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇక యాంటీబయాటిక్‌ మందుల వినియోగం ఎక్కువగా ఉండే శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లనూ ఈ రెండోతరం యంటీబయాటిక్‌ నిరోధించిందని ఈ పరిశోధనలో పాల్గొన్న రిచార్డ్‌ లీ తెలిపారు.