ట్రాన్స్‌జెండర్లలోనూ వీర్యం ఉత్పత్తి సాధ్యమే!

06-08-2019: లింగమార్పిడి చేయించుకుని మహిళలుగా మారిన వారిలో వీర్యం ఉత్పత్తి సాధ్యమవుతుందా..? అంటే అమెరికాలోని మ్యాగీ-ఉమెన్స్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. మగతనాన్ని అణచివేసే మందుల వాడకం ఆపేసిన తర్వాత కూడా వారిలో వీర్యం ఉత్పత్తిని గమనించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. లింగమార్పిడి చేసుకున్న ఇద్దరు మహిళలు తిరిగి సంతానోత్పత్తి పొందడానికి ప్రయత్నించిన కేసులను వారు నివేదించారు. ఈ రెండు కేసుల్లో హార్మోన్‌ చికిత్సను ఆపేసిన తర్వాత కూడా వారిలో వీర్యం వృద్ధిని గుర్తించారు.
 
అలాగే లింగమార్పిడి చేయించుకుని ఇంకా హార్మోన్‌ చికిత్స తీసుకోని మరో ఎనిమిది మంది వీర్యంతో ఆ ఇద్దరి వీర్యాన్ని పోల్చి చూశామని మ్యాగీ ఉమెన్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హన్నా వాలి పులాస్కి తెలిపారు. ఈ మేరకు ఆ వివరాలను పీడియాట్రిక్స్‌ అనే జర్నల్‌లో వెల్లడించారు. హార్మోన్‌ చికిత్సలో భాగంగా లుప్రాన్‌ అనే ఔషధాన్ని తీసుకుంటున్న ఒక మహిళకు ఆ మందుల్ని నిలిపేశారు. ఐదు నెలల తర్వాత గమనించగా ఆమెలో వీర్యం ఉత్పత్తి సాధ్యమైనట్టు గుర్తించారు.