ఒత్తిడితో మతిమరుపు...

ఆంధ్రజ్యోతి, 10/10/14: మానసిక ఒత్తిడికి , ఉద్వేగానికి గురయ్యే మహిళల్లో జ్ఞాపకశక్తి తొందరగా క్షీణిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. పెద్దతనం వచ్చేటప్పటికి వీరిలో అల్జీమర్‌ సమస్య తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధనను నాలుగు దశాబ్దాల పాటు నిర్వహించారు. 800 మంది మహిళలను పరీక్షించారు. 46 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళలపై ప్రధానంగా ఈ అధ్యయనం చేశారు. వారిలోని వ్యక్తిత్వ లోపాల కారణంగా కూడా జ్ఞాపకశకి తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా వారి వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకునేందుకు పలు ప్రశ్నలను సైతం వేశారు. అసూయ, తరచూ మూడ్స్‌ మారిపోతుండడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తే అవి అల్జీమర్‌కు దారితీస్తాయి. ఇలాంటి ఆడవాళ్లు తొందరగా ఒత్తిడికి కూడా గురవుతుంటారు. అంతేకాదు వీళ్లల్లో ఉద్వేగం, భయం వంటి లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మొత్తం మీద ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే దాదాపు 19 శాతం మంది మహిళలు డిమెన్షియా బారినపడ్డారని. తీవ్రంగా న్యూరోటిసిజంతో బాధపడుతున్న వారిలో మెదడుకు సంబంధించిన డిమెన్షియా జబ్బు వస్తుంది. అలాగే ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారిలో అల్జీమర్‌ వచ్చే అవకాశాలు రెండు రెట్లు అధికమవుతాయి. అయితే యోగా, ధ్యానం క్రమం తప్పకుండా చేయడం వల్ల డిమెన్షియా వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయని వెల్లడయింది.