3డీ గుండె ప్రింటింగ్‌కు కొత్త టెక్నాలజీ!

03-08-2019: మానవ గుండెను పూర్తిస్థాయిలో 3డీ ప్రింట్‌ చేసే దిశగా ఓ అడుగు ముందుకు పడింది. అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాలోని కార్నెగి మెలోన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మానవ శరీరంలోని ప్రధాన ప్రొటీన్‌ అయిన కొలాజెన్‌ నుంచి 3డీ బయోప్రింట్‌ టిష్యూ పరంజాను అభివృద్ధి చేయచ్చని తాజాగా ప్రచురించిన సైన్స్‌ జర్నల్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. ఫ్రీఫామ్‌ రివర్సబుల్‌ ఎంబెడింగ్‌ ఆఫ్‌ సస్పెండెడ్‌ హైడ్రోజెల్స్‌ (ఫ్రెష్‌)గా పిలిచే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేక సవాళ్లను అధిగమించడానికి దోహదపడిందని వారు చెప్పారు. గుండెతో సహా శరీరంలోని ప్రతి అవయవం ప్రత్యేక కణాలతో తయారవుతాయి. వీటిని ఎక్స్‌ట్రా సెల్యులర్‌ మ్యాట్రిక్స్‌ (ఈసీఎం) అని పిలిచే జీవసంబంధమైన టిష్యూ పరంజాతో కలిపి ఉంచుతుంది. గుండె యొక్క భాగాలను కణాల నుంచి, కొల్లాజెన్‌ నుంచి గుండె వాల్వ్‌ ద్వారా పనిచేసే భాగాలుగా ముద్రించవచ్చని తాము కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.