మ్యూజిక్‌తో మూర్ఛ తగ్గుతుందా?

 ఆంధ్రజ్యోతి, 12-8-15:  మ్యూజిక్‌తో మూర్ఛవ్యాధికి చికిత్స చేయవచ్చుట. ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. మూర్ఛ వ్యాధి ఉన్న వారు మ్యూజిక్‌కి వివిధ రకాలుగా స్పందించడం అధ్యయనకారులు గమనించారు. మూర్ఛ వ్యాధి లేనివారిలో ఇలాంటి స్పందనలు లేకపోవడాన్ని కూడా గుర్తించారు. అంతేకాదు మూర్ఛకు మ్యూజిక్‌ చక్కటి థెరపిటిక్‌ ట్రీట్‌మెంట్‌గా అధ్యయనకారులు పేర్కొన్నారు. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు మ్యూజిక్‌ ఒక శక్తివంతమైన ‘ఇంటర్‌వెన్షన్‌’గా పేర్కొన్నారు. ది ఓహియో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు ఈ రీసెర్చ్‌ను చేశారు. 80 శాతం మూర్ఛ కేసులు టెంపోరల్‌ లోబ్‌ ఎపిలప్సీకి చెందినవి. బ్రెయిన్‌లోని టెంపోరల్‌ లోబ్‌ నుంచి మూర్ఛ బాపతు అటాక్స్‌ వస్తాయి. మ్యూజిక్‌ కూడా బ్రెయిన్‌లోని ఇదే ప్రదేశంలో ప్రాసెస్‌ అవుతుంది. ఆ భాగాన్ని ఆడిటరీ కార్టెక్స్‌ అంటారు. అందువల్లే మ్యూజిక్‌ ప్రభావం మూర్ఛరోగుల మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని ఈ అధ్యయన బృందం తెలుసుకోవాలనుకుంది. మూర్ఛవున్న వారితోపాటు మూర్ఛలేని వాళ్లల్లో కూడా మ్యూజిక్‌ ప్రభావం ఎలా ఉందో ఆ బృందం తెలుసుకుంది. ఇందుకోసం ఎలక్ట్రో  ఎన్‌సెఫెలోగ్రామ్‌ని ఉపయోగించింది. మాడుకు ఎలక్ట్రోడ్స్‌ను అనుసంధించారు. అది బ్రెయిన్‌వేవ్‌ పేట్రన్స్‌ను రికార్డు చే స్తుంది.
 
ఇందుకోసం ఒహియో స్టేట్‌ యూనివర్సిటీలోని ఎపిలెప్సీ మానిటరింగ్‌ యూనిట్‌లో ఉన్న 21 మంది మూర్ఛ రోగులను 2012 సెప్టెంబరు నుంచి 2014, మే వరకూ అధ్యయనం చేశారు. పేషంట్లను పది నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉండమన్నారు. ఆ తర్వాత సంగీతం వినిపించారు. అప్పుడు బ్రెయిన్‌ వేవ్‌ పాట్రన్స్‌ ఎలా ఉన్నాయో పరిశీలించారు. అలా రెండు మూడుసార్లు పరీక్షించారు. వాళ్లు మ్యూజిక్‌ వినేటప్పుడు బ్రెయిన్‌ వేవ్‌ యాక్టివిటీ అత్యున్నత స్థాయిలో ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మూర్ఛలేని వారికన్నా మూర్ఛతో బాధపడుతున్న వారిలో బ్రెయిన్‌ వేవ్‌ యాక్టివిటీ మ్యూజిక్‌తో బాగా సింక్రనైజ్‌ అయింది. అది కూడా టెంపోరల్‌ లోబ్‌లో ఈ సింక్రనైజేషన్‌ బాగా ఉందని తేలింది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కన్నా మ్యూజిక్‌ వింటున్నప్పుడు కలిగే ఎఫెక్టు బ్రెయిన్‌పై ఎక్కువగా ఉండడాన్ని అధ్యయనకారులు గుర్తించారు. నిశ్శబ్దం కన్నా మ్యూజిక్‌ ప్రాసెస్‌ బ్రెయిన్‌లో విభిన్నంగా ఉంటుందని గమనించారు