ఒక్క ఇంజెక్షన్‌తో 13 ఏళ్లు కుటుంబ నియంత్రణ

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి నిరోధం

ప్రపంచంలోనే తొలిసారిగా అభివృద్ధిచేసిన ఐసీఎంఆర్‌
డీసీజీఐ అనుమతులు రాగానే అందుబాటులోకి..

న్యూఢిల్లీ, నవంబరు 19: ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ కోసం పురుషులు వేసెక్టమీ ఆపరేషన్లు చేసుకోవాల్సి వచ్చేది. ఇకపై ఒకే ఒక ఇంజెక్షన్‌ చేయించుకుంటే చాలు. 13 ఏళ్ల పాటు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి అడ్డుకట్ట పడుతుంది!! ఈ ఇంజెక్షన్‌ను భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆర్‌.ఎస్.శర్మ నేతృత్వంలోని నిపుణుల బృందం అభివృద్ధిచేస్తోంది. దీనికి రివర్సిబుల్‌ ఇన్‌హిబిషన్‌ ఆఫ్‌ స్పెర్మ్‌ అండర్‌ గైడెన్స్‌(ఆర్‌ఐఎస్‌యూజీ) అని పేరుపెట్టారు. పురుషుల వృషణాల నుంచి వీర్యకణాలను మూత్రనాళానికి చేరవేసే నాళికకు మత్తుమందు ఇచ్చి.. ఈ ఇంజెక్షన్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. 303 మందిపై మూడు విడతలు జరిపిన ప్రయోగ పరీక్షల్లో 97.3 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని సమాచారం. ఈ ఇంజెక్షన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదం లభించడానికి మరో ఏడు నెలలు పట్టొచ్చు. ఇది అందుబాటులోకి వస్తే.. భారతీయులు అభివృద్ధిచేసిన, ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్‌ కానుంది. ఈ ఇంజెక్షన్‌ అభివృద్ధిలో కీలకమైన స్టైరీన్‌ మెలీక్‌ యెన్‌హైడ్రేడ్‌ పాలిమర్‌ను 1970లోనే ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రొఫెసర్‌ సుజయ్‌కుమార్‌ గుహ కనుగొన్నారు. 1984 నుంచే ఆ పాలిమర్‌తో సంతాన నిరోధక ఇంజెక్షన్‌ అభివృద్ధిపై ఐసీఎంఆర్‌ పరిశోధనలను ప్రారంభించింది.
 
అమెరికా వల్ల కాలేదు..
ఈ ఇంజెక్షన్‌ అభివృద్ధిపై అమెరికా కూడా దృష్టిసారించింది. ఈక్రమంలో 2016లో ఆ దేశం జరిపిన ప్రయోగ పరీక్షలు ప్రతికూల ఫలితాలు ఇచ్చాయి. ఇంజెక్షన్‌ చేయించుకున్న పురుషుల మొహంపై మొటిమలు, శరీరంపై మచ్చలు వచ్చాయి. వారి మానసిక స్థితిగతులూ ప్రతికూలంగా ప్రభావితమయ్యాయంటూ యూకేకు చెందిన నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ వెబ్‌సైట్‌ అప్పట్లో ఓ కథనాన్ని ప్రచురించింది.