ఫిల్టర్‌ కాఫీతో టైప్-2 డయాబెటీస్‌ దూరం

 డయాబెటీస్‌ రాకుండా జాగ్రత్త పడవచ్చు కానీ, దాన్ని పూర్తిగా నయం కాదన్న సంగతి తెలిసిందే! పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని ప్రభావాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే  ఫిల్టర్ కాఫీతో టైప్--–2 డయాబెటిస్‌ను దూరం చేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది. స్వీడన్‌లోని చామర్స్ యూనివర్సిటీ, యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఈ విషయం తేలింది. టైప్--–2 డయాబెటిస్‌ ముప్పును నివారించడంలో ఫిల్టర్ కాఫీ బాగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్ని రోజులుపాటు ఫిల్టర్ కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్–2 డయాబెటిస్ ముప్పు కొంత దూరమైన విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మధుమేహాన్ని నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చిందన్నారు. రోజుకు రెండు, మూడు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగే వారిలో టైప్–2 డయాబెటిస్ ముప్పు 60 శాతం దూరమైనట్టు తమ పరిశోధనలో తేటతెల్లమైనట్టు వారు తెలిపారు.