మద్యపానంతో నిద్ర దూరం

ఆంధ్రజ్యోతి, 22/12/14: రెండు పెగ్గులు తాగితే.. చక్కగా నిద్రపడుతుందని అనుకుంటున్న వారంతా తమ అభిప్రాయాన్ని మార్చుకోండని చెబుతున్నారు అమెరికన్‌ పరిశోధకులు. అసలు నిద్రలేమికి ప్రదాన కారణం మద్యపానమేనని వారు నిర్ధారించారు. ఈ అంశంపై మిస్సోరీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో వారు నిర్వహించిన పరిశోధనలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మద్యం సేవిస్తే బాగా నిద్రపడుతుందని అపోహ ఉందనీ, అది నూటికి నూరుపాళ్లు తప్పని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మహేష్‌ ఠక్కర్‌ తెలిపారు. మద్యపానం వల్ల మనిషిలోని శరీర గడియారపు పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. మన మెదడులోని స్లీప్‌ హోమియోస్థాసిస్‌ అనే వ్యవస్థ మనల్ని నిద్రకు ఉపక్రమించేలా చేయటంతో బాటు తిరిగి మేల్కొనేలా చేస్తుందనీ, తరచూ మద్యం తీసుకోవటం వల్ల అది ఈ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన తెలిపారు. సరిగా నిద్ర లేనప్పుడు శరీరంలో వెలువడే ఎడినోసిన్‌ అనే పదార్థం వల్ల మనం మరింత సేపు నిద్రపోతాయని వారు తెలిపారు. ఇక..ఆల్కహాల్‌ తీసుకున్న వారికి కలత నిద్రతో బాటు పలుమార్లు మూత్ర విసర్జకు వెళ్లాల్సి వస్తుందని పరిశోధన వెల్లడించింది. ఇక తరచూ..పొద్దుపోయేదాకా తాగుతూ కూర్చునే వారిలో నిద్రలేమితో బాటు పడుకున్న కాసేపటికే మెలకువ రావటాన్ని గమనించినట్లు పరిశోధకులు తెలిపారు.