డీ విటమిన్‌ లోపంతో.. మరణాలు

బార్సిలోనా, సెప్టెంబరు 20: డీ విటమిన్‌ ఎండ ద్వారా మన శరీరానికి లభిస్తుందనే సంగతి తెలిసిందే. క్యాన్సర్‌, గుండెజబ్బులతో సంభవిస్తున్న మరణాల కంటే డీ విటమిన్‌ లోపంతో జరుగుతున్న మరణాలే ఎక్కువని ‘యూరోపియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డయాబెటిస్‌’ నివేదిక ప్రకటించింది. 1991-2011 మధ్యకాలంలో(20 ఏళ్లలో) ఆస్ట్రియాలోని వియన్నా జనరల్‌ ఆస్పత్రిలో డీ విటమిన్‌ పరీక్షలు చేయించుకున్న 78,581 మంది రోగుల వివరాలను.. జాతీయ మరణాల రిజిస్టరుతో పోల్చి, విశ్లేషించిన అనంతరం ఈ అవగాహనకు వచ్చినట్లు వెల్లడించింది. డయాబెటిస్‌ రోగుల మరణాల రేటు పెరిగేందుకూ ఇదొక ప్రధాన కారణంగా మారిందని పేర్కొంది. ఆరోగ్యవంతులతో పోల్చితే.. తీవ్రమైన డీ విటమిన్‌ లోపంతో బాధపడుతున్న 45-60 ఏళ్లవారు త్వరగా మరణించేందుకు మూడురెట్లు ఎక్కువ అవకాశాలు ఉంటాయని నివేదిక తెలిపింది.