కళలతో మతిమరుపు మాయం

ఆంధ్రజ్యోతి, 14-4-15: మధ్యవయస్కులు, వృద్ధులు మతిమరుపుతో ఇబ్బందిపడకుండా ఉండాలంటే మనసుకు నచ్చిన కళలు, హస్తకళలో ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. ఒకవేళ ఇవి కుదరవనుకుంటే నలుగురితో కలవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బంది పెట్టే డిమెన్షియా బారిన పడకుండా ఉండొచ్చు అంటున్నాయి పరిశోధనలు. ‘‘పలు కార్యక్రమాలతో మెదడును బిజీగా ఉంచితే న్యూరాన్స్‌ దెబ్బతినకుండా ఉంటాయి. మెదడులో బ్లాక్స్‌ ఏర్పడవు. కణాలు నాశనం కావు. కొత్త న్యూరాన్స్‌ కూడా ఏర్పడతాయి’’ అని వివరించారు రోచెస్టర్‌లోని మేవో క్లినిక్‌ పరిశోధకులు. ‘‘మా స్టడీలో భాగంగా 87 యేళ్ల వయసు గల 256 మందిపై పరిశోధనలు చేశాం. జ్ఞాపకశక్తి, ఆలోచనల పరంగా సమస్యలు లేనివాళ్లనే స్టడీకోసం ఎంపికచేసుకున్నాం. వీళ్లలో కొందరు పెయింటింగ్‌, డ్రాయింగ్‌, స్క్లప్టింగ్‌ వంటి కళలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకొందరు చెక్కపని, పాటరీ సెరామిక్స్‌ క్విల్టింగ్‌, కుట్టుపని వంటి హస్తకళలకు సంబంధింన అంశాలు చేశారు. మిగతా వాళ్లు నలుగురితో కలవడం అంటే థియేటర్‌కి వెళ్లడం, సినిమాలు చూడడం, కాన్సర్ట్స్‌కి వెళ్లడం, స్నేహితులని కలిసి కబుర్లు చెప్పుకోవడం, బుక్‌ క్లబ్స్‌, ప్రయాణాలు చేయడంతో పాటు కంప్యూటర్‌కి సంబంధించిన ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడారు. వెబ్‌లో వాళ్లకి కావాల్సిన విషయాలను వెతకడం, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయడం వంటివి చేశారు. నాలుగేళ్ల తరువాత చూస్తే వీళ్లలో 121 మందిలో కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌ (ఎంసిఐ) శాతం చాలా తక్కువగా కనిపించింది. 

కళలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనని వాళ్లతో పాల్గొన్న వాళ్లని పోల్చినప్పుడు ఎంసిఐ అవకాశాలు 73 శాతం తక్కువగా కనిపించాయి. అదే హస్తకళల్లో పాల్గొన్న వాళ్లలో గమనిస్తే ఎంసిఐ అభివృద్ధి అయ్యే అవకాశాలు 45 శాతం తగ్గాయి. నలుగురితో కలుస్తూ సోషలైజ్‌ అయిన వాళ్లలో ఎంసిఐ బారిన పడే అవకాశం 55 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అలాగే కంప్యూటర్‌ వాడకం వల్ల ఎంసిఐ రిస్క్‌ 53 శాతం తగ్గిపోయింది. ఎపిఒఇ అనే జన్యువు వల్ల మధ్య వయస్కుల్లో హైబిపి, డిప్రెషన్‌ రిస్క్‌ కూడా ఉంటుంది. ఇవేకాకుండా రక్తనాళాలకు సంబంధించిన సమస్య ఏర్పడడం వల్ల ఎంసిఐ అభివృద్ధి చెందుతుంద’’ని పరిశోధనల్లో వెల్లడైందని అంటున్నారు వాళ్లు.