మద్యంతో పాటు సరిపడా తింటే మందు దుష్ప్రభావం ఉండదా..?

మత్తు వదలరా...!

ఆంధ్రజ్యోతి (24-12-2019): పుట్టినరోజులు... పెళ్లిరోజులు... పండగలు.... ఇలాంటి ఏ సందర్భం ఉన్నా, అసలు ఎలాంటి సందర్భమూ లేకపోయినా.... విందు, దాంతో పాటు మందు ఇప్పుడు చాలా మామూలైపోతున్నాయి! ‘గమ్మత్తైన ఆ మత్తులో అడపాదడపా తూలకపోతే... సరదాలకు, వినోదాలకు అర్థం, పరమార్థం లేనే లేదు’ అనుకుంటున్నారు. అయితే మందు మత్తులో ముంచుతుందా? లేక బయట పడలేని ఊబిలోకి లాగేస్తుందా?. తాత్కాలిక సరదాలను అందిస్తోందా? లేక శాశ్వత దుష్పరిణామాలకు దారి తీస్తోందా?. రానున్న ‘న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌’ టైమ్‌లో... ఓ లుక్కేద్దాం!
 
టీనేజ్‌లోకి అడుగుపెట్టక ముందే మద్యం రుచి చూసే వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోతోంది. మన దేశంలో సుమారుగా 13 ఏళ్ల వయసు నుంచే మద్యపానం మొదలుపెడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మద్యం మత్తు దిగినంత తేలికగా దాని ప్రభావం శరీరం నుంచి దిగిపోదు. అది అందించే తాత్కాలిక మత్తు, ఆరోగ్యాన్ని శాశ్వతంగా చిత్తు చేస్తుందనేది వాస్తవం!
 
మద్యపానంలో మూడు రకాలు!
అరుదుగా, తరచుగా... ఇలా రెండు విధాల్లో తాగేవారు ఉంటారు. వారంలో ఒకసారి కేవలం రెండు పెగ్‌ల మద్యాన్ని మాత్రమే సేవిస్తే ‘సోషల్‌ డ్రింకింగ్‌’ అనీ, ప్రతి రోజూ తాగుతూ ఉంటే, ‘క్రానిక్‌ డ్రింకింగ్‌’ అనీ వైద్యులు వర్గీకరించారు. అయితే ఈ రెండిటికంటే భిన్నమైన ‘బింజ్‌ డ్రింకింగ్‌’ ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తోంది. వారంలో ఒక్కసారి తాగినా ఎక్కువ మద్యం తాగేయడమే - బింజ్‌ డ్రింకింగ్‌! ఇది ‘క్రానిక్‌ డ్రింకింగ్‌’తో సమానం.
 
మద్యంతో నష్టాలు ఇవే!
మద్యం ప్రభావం నాడీ వ్యవస్థ, కాలేయం, జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, గుండె, మానసిక స్థితుల మీద ఉంటుంది. మద్యం తాగిన వెంటనే మాట, నడకల్లో తూలుడు, విచక్షణ కోల్పోవడం లాంటి తాత్కాలిక లక్షణాలు కనిపిస్తాయి. అంతకుమించి, దీర్ఘకాలంలో అంతర్గతంగా శాశ్వత నష్టం కలిగించే ప్రభావం మద్యానికి ఉంటుంది.
 
నాడీవ్యవస్థ: మద్యపానం వల్ల ఆహారంలోని పోషకాలను శోషించుకునే శక్తి శరీరంలో సన్నగిల్లుతుంది. ఫలితంగా పోషకాహార లోపం తలెత్తుతుంది. ఫలితంగా నాడీసంబంధ సమస్యలు మొదలవుతాయి. మద్యం ప్రభావంతో పరాధీన నాడుల పనితీరు దెబ్బతినడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలు వేధిస్తాయి. కేంద్రనాడీ వ్యవస్థ దెబ్బతిని, నడకలో తూలు శాశ్వతంగా మిగిలిపోతుంది.
 
జీర్ణవ్యవస్థ: మద్యం జీర్ణవ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. అతి స్వల్ప పరిమాణంలో మద్యం తీసుకున్నా ఎక్కువ మొత్తంలో ఆమ్లం ఉత్పత్తి జరిగి, ‘గ్యాస్ట్రయిటి్‌స’(జీర్ణాశయ లోపలి పొర వాపు) సమస్య తలెత్తుతుంది. దాంతో పొట్టలో మంట, నొప్పి, వాంతులు, కొన్ని సందర్భాల్లో పొట్టలో పుండ్లు మొదలవుతాయి. అలాగే వీరిలో ‘ఎక్యూట్‌ ప్యాంక్రియాటైటిస్‌’ (క్లోమ గ్రంథి ఉబ్బిపోవడం) అనే సమస్య కూడా తలెత్తుతుంది. ఇది మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌కూ దారి తీయవచ్చు. ఇది కూడా ప్రాణాంతకమే!
 
కాలేయం: మద్యం తాగే 90 శాతం మందికి ‘ఫ్యాటీ లివర్‌’ ఉంటుంది. వీరిలో 30 శాతం మందికి ‘సివియర్‌ ఆల్కహాలిక్‌ హెపటైటిస్‌’ (కామెర్లు) అనే సమస్య ఉంటుంది. ఈ స్థితి ప్రాణాంతకంగా మారవచ్చు లేదా ‘లివర్‌ సిరోసి్‌స’కు దారి తీయవచ్చు.
 
మూత్రపిండాలు: మూత్రపిండాలు శరీరంలో నీటి సమతౌల్యాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే రక్తంలో కలిసిన ప్రమాదకర పదార్థాలనూ వడకడుతూ ఉంటాయి. మద్యం తీసుకోవడం మూలంగా మూత్రపిండాలకు ఆ సామర్ధ్యం తగ్గుతుంది. అలాగే మద్యం వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌ (నీటి శాతం తగ్గడం) స్థితి నెలకొంటుంది. ఈ స్థితి మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. అలాగే మద్యం అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి, తత్ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయి.
 
గుండె: మద్యం ప్రభావం గుండె మీద నేరుగా ఉండకపోయినా, మద్యం తాగే సమయంలో తినే పదార్థాల కారణంగా రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగి, తద్వారా గుండె జబ్బులు తలెత్తుతాయి. అలాగే మద్యంతో పెరిగే రక్తపోటు ప్రభావంతో గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది. గుండె పనితీరు సామర్ధ్యం తగ్గే సమస్య ‘ఆల్కహాలిక్‌ కార్డియో మయోపతి’ కూడా రావచ్చు.
 
పునరుత్పత్తి: పురుషుల్లో, స్త్రీలలో పునరుత్పత్తి అవయవాల పరిమాణం కుంచించుకుపోతుంది. ఫలితంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, స్త్రీలల్లో అండాల సంఖ్య తగ్గుతుంది.
 
మానసిక సమస్యలు: మద్యానికి బానిసలైనవారిలో డిప్రెషన్‌ తలెత్తుతుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం తిరిగి మద్యాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. వీరి చేత మద్యం మాన్పించే ప్రయత్నం చేస్తే విత్‌డ్రాయల్‌ సింప్టమ్స్‌ తీవ్రమై, కొంతమందిలో కార్డియాక్‌ అరెస్ట్‌ (గుండె ఆగిపోవడం)కూ దారి తీసే ప్రమాదం ఉంటుంది.
 
ఎంత తాగవచ్చు?
వారంలో రెండు డ్రింకులు... అంటే సుమారు 50 మిల్లీ లీటర్ల (రెండు పెగ్గులు) మద్యం మించకూడదు. ఒక పింట్‌ బీర్‌ ఒక యూనిట్‌ ఆల్కహాల్‌తో సమానం. ఒక యూనిట్‌ అంటే 10 మిల్లీ లీటర్ల లేదా 8 గ్రాముల స్వచ్ఛమైన ఆల్కహాల్‌. 25 మిల్లీ లీటర్ల విస్కీలో ఈ పరిమాణంలో ఆల్కహాల్‌ ఉంటుంది. అంటే వారంలో ఒకసారి 50 మిల్లీ లీటర్ల (రెండు పెగ్గులు)కు మించి మద్యం తీసుకోకూడదు. అలాగే ఇంతే పరిమాణంలో ఆల్కహాల్‌ పరిమాణం ఒక బీరు సీసాలో ఉంటుంది. కాబట్టి వారంలో ఒక్క బీరుకు మించి తాగకూడదు.
 
కిక్కులెక్క!
మద్యంలో ఆల్కహాల్‌ గ్రాముల పరిమాణంలో ఉంటుంది. అన్ని రకాల మద్యాల్లో (విస్కీ, ఓడ్కా, రమ్‌, జిన్‌, షాంపెయిన్‌, బ్రాందీ) ఆల్కహాల్‌ పరిమాణం ఇంచుమించుగా, 100 మిల్లీ లీటర్లలో సుమారుగా 42 గ్రాములు ఉంటుంది. ఉదాహరణకు 90 మిల్లీ లీటర్ల విస్కీ తీసుకుంటే సుమారుగా 40 గ్రాముల ఆల్కహాల్‌ తాగినట్టుగా భావించాలి. అయితే 100 మిల్లీ లీటర్ల బీరులో 5 గ్రాముల ఆల్కహాల్‌ మాత్రమే ఉన్నా, సీసా మొత్తం 650 మిల్లీ లీటర్ల పరిమాణం తాగడంతో సుమారుగా 40 గ్రాముల ఆల్కహాల్‌ తాగేస్తూ ఉంటారు. అంటే ఒక బీరు సీసా, మూడు పెగ్గుల (90 మిల్లీ లీటర్ల) విస్కీతో సమానంగా భావించాలి.
 
మహిళల్లో...
పురుషులతో పోల్చినప్పుడు మద్యం కారణంగా కాలేయం దెబ్బతినే తీవ్రత మహిళల్లో ఎక్కువ.. ఆల్కహాల్‌ను అరిగించుకోవడానికి ఉపయోగపడే ‘ఆల్కహాల్‌ డీహైడ్రోజినేజ్‌’ అనే ఎంజైమ్‌ మహిళల్లో తక్కువగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి వీరిలో త్వరగా, తేలికగా కాలేయం దెబ్బతింటుంది.
 
అపోహలు - వాస్తవాలు!
మద్యం గురించి ఎవరికి అనుకూలమైన వాదనలు వాళ్లు వినిపిస్తూనే ఉంటారు. దాని ప్రభావం ఆరోగ్యం మీద పడకుండా తప్పించుకోవడం కోసం ఎక్కడో విన్నవీ, చదివినవీ ఆచరిస్తూ ఉంటారు. విస్కీ కంటే బీరు మేలనీ, దాని కంటే వైన్‌ సురక్షితమనీ... ఇలా లెక్కలేనన్ని నమ్మకాలు ఉంటూ ఉంటాయి. కానీ నిజాలు ఇందుకు పూర్తి విరుద్ధం!
 
అపోహ: హార్డ్‌ లిక్కర్‌ కంటే బీర్లు సురక్షితం!
వాస్తవం: బీరు సీసా మీద ముద్రించి ఉండే ఆల్కహాల్‌ పరిమాణం 5శాతం. ఇది 100 మిల్లీ లీటర్ల బీరులో ఉండే ఆల్కహాల్‌ శాతం. దీన్ని బట్టి 650 మిల్లీ లీటర్ల బీరు సీసాలో సుమారుగా 32.5 గ్రాముల ఆల్కహాల్‌ ఉంటుందని గ్రహించాలి. ఇది మూడు పెగ్గుల హార్డ్‌ లిక్కర్‌తో సమానం.
 
అపోహ: మద్యంతో పాటు సరిపడా తింటే మందు దుష్ప్రభావం ఉండదు.
వాస్తవం: పోషకాహారం తీసుకునేవాళ్లు, తీసుకోనివాళ్లు ఇద్దరి కాలేయాల మీద మద్యం ప్రభావంలో స్వల్ప తేడా ఉంటుంది. అయితే ఇందుకోసం పౌష్టికాహారంగా నూనె తక్కువగా వాడి, ఇంట్లో వండిన, మాంసకృత్తులు, ఖనిజలవణాలతో కూడిన ఆహారం తీసుకోవాలి.
 
అపోహ: మద్యంలోకి సోడా కంటే నీళ్లు మేలు!
వాస్తవం: సోడాలో క్యాలరీలు ఉండవు. కాబట్టి సోడా వల్ల లావవుతాం అనేది అపోహ మాత్రమే! సోడా, నీళ్లు... ఏది కలిపి మద్యం తాగినా ప్రభావం సమానంగానే ఉంటుంది.
 
అపోహ: బీరు తాగి ఆరోగ్యంగా లావెక్కవచ్చు!
వాస్తవం: బీరులో క్యాలరీలతో పాటు ఆల్కహాల్‌ కూడా ఉంటుంది. కాబట్టి లావయినా ఆరోగ్యపరమైన చెడు జరిగే వీలూ ఉంటుంది. అలాగే బీరుతో ప్రతి ఒక్కరూ లావవుతారు అనీ చెప్పలేం! బీరు బదులు పౌష్టికాహారం, వ్యాయామంతో అంతకంటే మెరుగ్గా, ఆరోగ్యంగా లావయ్యే వీలుంది.
 
అపోహ: నింపాదిగా తాగడం క్షేమం!
వాస్తవం: ఎంత వేగంగా తాగినా, ఎంత నింపాదిగా తాగినా... ఎంత తాగారు? అనేది కీలకం. తాగే ఆల్కహాల్‌ మీద దుష్ప్రభావాలు ఆధారపడి ఉంటాయి.
 
అపోహ: రెడ్‌ వైన్‌ లేదంటే బ్రాందీ గుండెకు మంచిది!
వాస్తవం: రెడ్‌ వైన్‌ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గి, గుండెకు మేలు జరుగుతుందని 2000వ సంవత్సరంలో ఒక అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఆ అధ్యయనాన్ని ఇంతవరకూ ఎవరూ నిరూపించలేకపోయారు. పైగా రెడ్‌ వైన్‌లో కూడా ఆల్కహాల్‌ ఉంటుంది. కాబట్టి మిగతా అన్ని మద్యాలకు లాగే, పరిమితంగా తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే బ్రాందీ కూడా!
- డాక్టర్‌ సోమశేఖర రావు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, హైదరాబాద్‌