బరువులు ఎత్తితే.. తెలివి పెరుగుతుంది!

ఆంధ్రజ్యోతి(26-10-2016):  మీ తెలివితేటలను మరింత పెంచుకోవాలా? అయితే, క్రమం తప్పకుండా బరువులు ఎత్తండి! వారానికి రెండు సార్లయినా వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తూ తీవ్రంగా శ్రమించండి! ఇలా చేస్తే కండలు బలోపేతమవడమే కాదు.. మెదడు పనితీరూ మెరుగవుతుందని సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వృద్ధాప్యంలో విషయ గ్రహణ శక్తిని స్వల్పంగా కోల్పోయిన ‘మైల్డ్‌ కాగ్నిటివ్‌ ఇంపెయిర్‌మెంట్‌(ఎంసీఐ)’ రోగులపై వీరు పరిశోధన నిర్వహించారు. ఎంసీఐ లక్షణాలు అల్జీమర్స్‌ వ్యాధి రాకకు సంకేతాలని, అందువల్ల ఈ దశలోనే కాగ్నిటివ్‌(విషయ గ్రహణ) శక్తిని కాపాడితే ప్రయోజనం ఉంటుందని గుర్తించారు. 55-86 ఏళ్ల మధ్య గల 100 మంది ఎంసీఐ రోగులకు విషయ గ్రహణ శక్తి పెరిగేలా మెదడుకు శిక్షణను ఇవ్వడంతో పాటు వారానికి రెండు సార్ల చొప్పున ఆరు నెలల పాటు బరువులు ఎత్తే వ్యాయామం చేయించారు. దీంతో వారి కండరాలు బలోపేతమై శారీరక శక్తి గణనీయంగా పెరగింది. దీంతోపాటు విషయ గ్రహణలో మెదడు పనితీరూ మెరుగుపడిందని గుర్తించారు. అందువల్ల క్రమం తప్పకుండా బరువులు ఎత్తే వ్యాయామం చేస్తే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పరిశోధకులు సూచించారు.