ఇక వందేళ్లు గ్యారంటీ

ఆంధ్రజ్యోతి, 21/01/14: ఇప్పుడు పుట్టిన పిల్లలంతా వందేళ్లూ బతకడానికి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య, వైద్య, జన్యు రంగాలలో జరుగుతున్న పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయని, మరో రెండేళ్లలో వందేళ్లకు పైబడిన ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి మాత్రలు సిద్ధం కాబోతున్నాయని వారు వెల్లడించారు. 

ఈ శతాబ్ద ప్రారంభంలో పుట్టిన పిల్లలు కచ్చితంగా వచ్చే శతాబ్దాన్ని కూడా చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఢంకా బజాయించి చెబుతున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా 21వ శతాబ్దంలో పుట్టినవారంతా ఆరోగ్యంగా, దీర్ఘాయుర్దాయంతో జీవించబోతున్నారని వారంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఈ శాస్త్రవేత్తలు ఈ మేరకు ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. ప్రస్తుత సగటు ఆయుర్దాయం 66 ఏళ్లు. 2025 నాటికి ఇది 75 ఏళ్లకు పెరుగుతుంది. 2050 వచ్చేటప్పటికి ఇది 100 ఏళ్లు దాటడం ఖాయం. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలంతా కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్ర త్తగా చూసుకుంటే వందేళ్ల పైబడి బతకడం తప్పనిసరి అని ఈ నివేదిక వెల్లడించింది. 

1950లో ఒక అధ్యయనం జరిపినప్పుడు సగటు ఆయుర్దాయం 50 ఏళ్ల లోపే ఉంది. వైద్య, ఆరోగ్య రంగంలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి ప్రజల ఆయురారోగ్యాలను బాగా పెంచబోతోందని ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిరోషీ నకజీమా పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుతం అనేక దేశాల్లో 20వ శతాబ్దంలో సగటు ఆయుర్దాయం పెరుగుతున్నప్పటికీ, పేద దేశాల్లో మాత్రం 50 ఏళ్లయినా దాటకుండానే మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురు అర్ధాయుష్కులుగానే చనిపోతున్నారు. అంతేకాక, అయిదేళ్ల లోపే మరణిస్తున్న శిశువుల సంఖ్య కూడా ఇప్పటికీ ఎక్కువగానే ఉందని కూడా తెలిపారు. ఇలా అర్ధాయుష్కులుగా, అల్పాయుష్కులుగా పోవడాన్ని ఆపడం ప్రస్తుతం ఆరోగ్య సంస్థ ముందున్న పెద్ద సవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. 

సుమారు 50 ఏళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటి వరకూ సగటు ఆయుర్దాయం పైనా, ఆరోగ్య రంగ అభివృద్ధి పైనా ఇక్కడ పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధిక దేశాలలో సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, వైద్య రంగాలలో జరుగుతున్న అభివృద్ధి, దాని ఫలితాలు పేద దేశాలలో సైతం 2025 నాటికి అద్భుతంగా అనుభవానికి వస్తాయని ఆ సంస్థ చెబుతోంది. ఏదైనా అతి పెద్ద ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంటే తప్ప మరో వందేళ్ల పాటు ఆరోగ్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించడం ఖాయమని అది తన నివేదికలో సూచించింది. 

శతాయుష్కులపై పరిశోధనలు 
ఆరోగ్య, వైద్య రంగాలు, సామాజిక, ఆర్థిక రంగాలు అభివృద్ధి చెందినా చెందకపోయినా వందేళ్లు దాటిని వ్యక్తులు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 53 వేలకు పైగా ఉన్నారు. వీరంతా 1886 నుంచి 1899 మధ్య పుట్టినవాళ్లే. వీరు ఇలా ఆరోగ్యంగా, సంపూర్ణ ఆయుర్దాయానికి మించిన ఆయుర్దాయంతో జీవించడానికి కారణమేమిటని అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ, జపాన్‌ దేశాల జన్యు, వైద్య ఆరోగ్య శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఇటీవల మాజీ సోవియట్‌ రిపబ్లిక్‌కు చెందిన జార్జియాలోని సాచినో అనే ఓ మారుమూల గ్రామంలో 132 ఏళ్ల మహిళ ఆంటిసా కివిషవా అనే మహిళ మరణించింది. 1880 జూలైలో జన్మించిన ఆ మహిళ చివరి క్షణం వరకూ ఆరోగ్యంగా జీవించడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. ఆమె శరీరాన్ని భద్రపరిచి ఆమె జన్యువులపై పరిశోధననలు చేయడానికి వీరు నిర్ణయించుకున్నారు. 

ఓ వ్యక్తి ఎంత కాలం జీవించగలడన్నదానిపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా, జపాన్‌ శాస్త్రవేత్తల బృందం 108 ఏళ్లు దాటిన వ్యక్తుల జీవన విధానాలను, అలవాట్లను, సంస్కృతీ సంప్రదాయాలను, జన్యు కణాలను, ఆర్థిక, సామాజిక పరిస్థితులను పరిశీలించిన శాస్త్రవేత్తలు దీర్ఘకాలం జీవించడానికి ఈ వ్యక్తులు ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేవీ లేవన్న సంగతిని గ్రహించారు. 1997లో ఫ్రాన్స్‌కు చెందిన 122 ఏళ్ల జాన్‌ కాల్మెంట్‌ అనే వ్యక్తి మరణించినప్పుడు, అతని జీవనశైలిపై అంతకు ముందు నుంచే పరిశోధనలు, పరిశీలనలు చేస్తున్న వైద్యులకు అతని శరీరంలో దీర్ఘకాలం జీవించడానికి దోహదం చేసే లక్షణాలేవీ కనిపించలేదు. 

ఈ పరిశోధనల ద్వారా వారు తేల్చింది ఏమిటంటే, దీర్ఘాయుర్దాయానికి జన్యువులు కొంత కారణమవుతున్నప్పటికీ, జీవన విధానమే అన్నిటికన్నా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. జపాన్‌లోని యెషివా యూనివర్సిటీకి చెందిన ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పరిశోధనలు చేస్తున్న పలువురు జన్యుశాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకు వేసి, 108 ఏళ్లకు పైగా బతుకుతున్న వ్యక్తుల్లో చాలామందికి ధూమపానం, మద్యపానం అలవాట్లు కూడా ఉన్నాయనీ, వారి ఆహార అలవాట్లు కూడా ఆధునిక ఆరోగ్య సూత్రాల కోవలో చేరవనీ, అంతేకాక, వారు వ్యాయామం చేసిన దాఖలాలు కూడా లేవనీ వెల్లడించారు. వారి ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి జన్యువులు, అలవాట్లు, స్థితిగతులను మించి మరేవో కారణమవుతున్నాయని వారు పేర్కొన్నారు. 

దురలవాట్ల ప్రభావం 
అంతమాత్రాన ఆరోగ్యంపై దురలవాట్ల ప్రభావం ఉండదని కాదు. ప్రజలు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అతీతంగా ఆరోగ్యవంతమైన జీవనశైలికి కట్టుబడి ఉండక తప్పదని వారు చెబుతున్నారు. అనారోగ్యకర అలవాట్లు, దురలవాట్లకు అతీతంగా వారు దీర్ఘకాలం జీవించడానికి వారికి మరేదో కారణాలు సహాయపడుతున్నాయని, వాటి మీదే తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామని వారు తెలిపారు. ఆయుర్దాయం పెరగాలన్నా, జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలన్నా తప్పనిసరిగా ఆరోగ్యవంతమైన పద్ధతులను అలవరచుకోవాల్సి ఉంటుందని, అదే విధంగా దురలవాట్లకూ దూరంగా ఉండాల్సిందేనని వారు స్పష్టం చేశారు. 

లోమా లిండా యూనివర్సిటీ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ గేరీ ఫ్రేజర్‌ ‘ఆయుర్దాయం-ఆరోగ్య అలవాట్లు’ అనే అంశంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. శాకాహార భోజనం, కొద్దిపాటి వ్యాయామం, దురలవాట్లకు దూరంగా ఉండడం, తరచుగా బాదం, జీడిపప్పు, వేరుశెనగపప్పు తినడం అనేవి దీర్ఘాయుర్దాయానికి ప్రధానమైన కారకాలని ఆయన నొక్కి చెప్పారు. ఇవన్నీ కాలపరీక్షకు నిలిచిన అంశాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని మినహాయింపులను తీసుకుని, ఆయుర్దాయాన్ని ఆంచనా వేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. 

విచిత్రమేమిటంటే, ప్రపంచంలో దీర్ఘాయుర్దాయం మీద పరిశోధనలు జరుపుతున్న వందలాది సంస్థలు, వ్యక్తులు ఆయుర్దాయంలో దురలవాట్లకు అంతగా ప్రాధాన్యం లేదనే చెబుతున్నారు. 108 ఏళ్లు దాటిన సుమారు 50 వేల మంది స్ర్తీపురుషులపై పరిశోధనలు జరిపిన అమెరికా, జపాన్‌ బృందాలు ఎక్కువగా జన్యు కారణాలను మాత్రం ఉటంకిస్తున్నాయి. ఆ తరువాతి స్థానం కూడా సామాజిక, ఆర్థిక స్థితిగతులకే ఇవ్వడం జరుగుతోంది. కాగా, దీర్ఘాయుష్కులలో మహిళలే ఎక్కువని, వారిలో కూడా ఎక్కువ మంది ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటుపడిన వారు కాదని వారి పరిశోధనల్లో తేలింది. 

అసలు కారణాలు! 
న్యూయార్క్‌ నుంచి ప్రచురితమవుతున్న ‘ఏజింగ్‌’ అనే ఆరోగ్య పత్రికఆ పరిశోధనల్లో కొత్త పుంతలు తొక్కింది. వందేళ్లు పైబడిన ఆరోగ్యవంతులపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు దీర్ఘాయుష్కుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, జన్యువులు, అలవాట్లపై మాత్రమే పరిశోధనలు జరుపుతూ, వారి దృక్పథం, వారి ఆలోచనా ధోరణి, అన్నిటికన్నా వారి మానసిక స్థితిగతులను పట్టించుకోకపోవడం అసలు విషయాన్ని మరుగున పడేస్తోందని ఈ జర్నల్‌ పేర్కొంది. వందేళ్లు పైబడి జీవించిన వారి వ్యక్తిత్వం గురించి ఎవరూ అధ్యయనం చేయకపోవడం దుర దృష్టకరమని అది స్పష్టం చేసింది. 

ఈ సంచికకు చెందిన శాస్త్రవేత్తలు న్యూయార్క్‌లో 106 ఏళ్లు పైబడి జీవిస్తున్న కొందరిని గుర్తించి, వారి జీవనశైలితో పాటు, వారి మానసిక స్థితిని కూడా సునిశితంగా పరిశీలించింది. ఇందులో ఎక్కువ మంది ప్రకృతికి సన్నిహితంగా జీవించినవారేనని అది తన పరిశోధనలు, పరిశీలనల్లో తెలుసుకుంది. ‘‘మాకు 30-40 ఏళ్లు వచ్చేవరకూ చెట్ల మధ్య, పశువుల మధ్య బతికాం’’ అని వారిలో ఎక్కువమంది చెప్పారు. వారు దేనికీ బాధపడకుండా, దేన్నీ లెక్క చేయకుండా, ప్రకృతి మీద ఆధారపడి బతకడం వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపిందని, అదే వారిని చిరంజీవులను చేసిందని శాస్త్రవేత్తలు వివరించారు. 

‘‘దీర్ఘాయుష్కుల్లో ప్రధానంగా మానసిక నిబ్బరం, నిర్లిప్తత, స్థయిర్యం, సానుకూల దృక్పథం ఎక్కువ. తమ వ్యక్తిత్వానికి అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం వీరిలో కనిపించే ప్రధాన లక్షణం. వారు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా పాటుబడిందేమీ లేదు. జన్యుకణాలలో లోపమున్నా వీరు ఆరోగ్యంగా, హాయిగా చాలా కాలంపాటు జీవించగలుగుతున్నారనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. జన్యువులకన్నా మానసిక స్థితి కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుందని మా పరిశోధనలు తేల్చాయి’’ అని ఈ జర్నల్‌కు చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్‌ నీర్‌ బార్జిలాయ్‌ స్పష్టం చేశారు.
 
అయితే, తమ పరిశోధనల్లో తాము దీర్ఘాయుర్దాయంలో జన్యు కణాలు పోషించే పాత్రను కూడా అవగతం చేసుకున్నామని ఆయన చెప్పారు. దీర్ఘాయుష్కులలో సి.ఇ.టి.పి అనే విభిన్న జన్యు కణం ఉన్నట్టు తాము గుర్తించామని, ఇదా కొలెస్టరాల్‌ను, గుండె జబ్బులను నియంత్రిస్తుంటుందని ఆయన తెలిపారు. తాము తమ పరిశోధనకు ఎంచుకున్న సుమారు వెయ్యి మందిలో 20 నుంచి 24 శాతం మంది శరీరాల్లో ఈ జన్యువు కనిపించిందని ఆయన వివరించారు. ఇటువంటి జన్యుకణాలను సృష్టించగల ఔషధాలను ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని, ఇవి గనుక మార్కెట్‌లో ప్రవేశిస్తే, వృద్ధాప్యంలో పట్టి పీడించే ఆరోగ్య సమస్యలన్నిటికీ పరిష్కారం లభ్యమవుతుందని ఆయన చెప్పారు. 

త్వరలో మాత్రలు రెడీ! 

విచిత్రమేమిటంటే, 70-80 ఏళ్ల వయసులో మరణిస్తున్నవారు అనారోగ్యాలతో మరణిస్తుండగా, 100 ఏళ్ల తరువాత మరణిస్తున్నవారు ఆరోగ్యంతో మరణిస్తున్నారని బార్జిలాయ్‌ వ్యాఖ్యానించారు. తాము వయసుతో ముడిపడి ఉన్న ఆల్జీమర్స్‌ వంటి అనారోగ్యాలపై పరిశోధనలు చేస్తున్నప్పుడు ఆయుర్దాయాన్ని పెంచే మందును కూడా అనుకోకుండా కనుగొన్నామని ఆయన తెలిపారు. వందేళ్లకు మించి ఆరోగ్యంగా బతకడానికి దోహదం చేసే మాత్రను కనిపెట్టామని, దీన్ని రెండేళ్లలో మార్కెట్‌లో ప్రవేశపెట్టడం జరుగుతుందని, ప్రస్తుతం దీన్ని పరీక్షలకు పంపామని ఆయన వెల్లడించారు. ఆయన ఇటీవల లండన్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి డాక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఔషధ కంపెనీలు ఈ మాత్రల్ని తయారు చేస్తున్నాయని చెప్పారు. 

క్యాన్సర్‌, డయాబెటిస్‌, మతిమరుపు వంటి అనారోగ్య సమస్యలను కూడా ఆ మాత్ర దగ్గరికి రానివ్వదని ఆయన తెలిపారు. వందేళ్ల తరువాత కూడా యాభై ఏళ్ల వ్యక్తిలా ఆరోగ్యంగా, చురుకుగా ఉండడానికి ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. జన్యు కణాల్లో లోపాలున్నా ఆయుర్దాయానికి లోపం లేకుండా ఈ మాత్ర శరీరాన్ని దృఢంగా ఉంచుతుందని, యాభై ఏళ్లు దాటిన తరువాతే ఈ మాత్రను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, జన్యుకణాన్ని బట్టి మనిషి ఆయుర్దాయాన్ని నిర్ణయించగల ప్రక్రియను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. బోస్టన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్తల బృందం ఈ విషయంలో పరిశోధనలు చేస్తోంది. జన్యుకణాన్ని బట్టి ఆయుర్దాయాన్ని నిర్ణయించిన తరువాత, ఆయుర్దాయాన్ని పెంచగల ప్రక్రియల మీద దృష్టి పెట్టాలని ఈ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.