అది కావాలంటే.. స్మార్ట్‌ఫోన్‌ పక్కన పెట్టాల్సిందే!

రట్గర్స్‌ వర్సిటీ పరిశోధకుల హెచ్చరిక

వాషింగ్టన్‌, ఆగస్టు 20: మీరు రోజంతా తీరిక లేకుండా పనిచేస్తున్నారా? పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు కాస్త విరామం తీసుకుంటున్నారా? ఆ విరామ సమయంలో కాఫీనో టీనో తాగుతూ స్మార్ట్‌ఫోన్‌ చూస్తున్నారా? అయితే అది మీకు ఏమాత్రం మానసిక ఉత్తేజాన్ని ఇవ్వదని చెబుతున్నారు అమెరికాలోని రట్గర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు. విరామ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం.. మెదడుని పునరుత్తేజితం కానివ్వదని తెలిపారు. ఫలితంగా పనిలో నాణ్యత పెరగకపోగా.. మరింత దిగజారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ‘మనుషుల ప్రవర్తనపై వ్యసనాల ప్రభావం’ పేరిట తాము చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఈ పరిశోధన కోసం 414 మంది కాలేజీ విద్యార్థులకు ఓ పనిని అప్పగించారు. పని మధ్యలో స్వచ్ఛందంగా విరామం తీసుకోవడానికీ అనుమతించారు. ఆ విద్యార్థుల్లో కొందరు విరామ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగించగా.. మరికొందరు అస్సలు విరామమే తీసుకోలేదు. అయితే, విరామంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగించిన వారు అందరికంటే దారుణమైన ప్రదర్శన చేశారని పరిశోధకులు తెలిపారు. కాగా, ఒత్తిడి తగ్గించుకోవడం కోసం తీసుకునే విరామంలో ప్రతిక్షణం విలువైనదేనని రట్గర్స్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ టెర్రీ కర్‌ట్జ్‌బర్గ్‌ తెలిపారు. ఆ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తే.. కలవరపాటుకు గురవుతామన్నారు.